తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలు ఆధారాలతో సహా బయటపడినా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, ఇంకా అధికారులతో పాత వివరణలే ఇప్పిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అధికారులు తాజాగా ఇచ్చిన వివరణకూ, డీఎస్సీ అభ్యర్ధులు అడుగుతున్న ప్రశ్నలకూ పొంతన లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉందని చెబుతున్న చంద్రబాబు.. మా పార్టీ నేతలు డీఎస్సీ స్కాంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాడులు చేయించడం ఏంటని శైలజానాథ్ నిలదీశారు. ఇప్పటికైనా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం డీఎస్సీ అక్రమాలపై చర్చకు సిద్దం కావాలని సాకే శైలజానాథ్ సూచించారు. ప్రెస్ మీట్లో సాకే శైలజానాథ్ ఇంకేమన్నారంటే... డీఎస్సీ అక్రమాలపై సరైన వివరణ ఏదీ ? రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన తీరు మీద అభ్యర్ధులు పదే పదే తమ అభ్యంతరాల్ని, అనుమానాల్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో వైయస్ఆర్‌సీపీ వారికి నష్టం జరగకూడదని, వ్యవస్థపై నమ్మకం పోకూడదనే సదుద్దేశంతో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. ప్రస్తుతం నిరాహారదీక్షలు కూడా కొనసాగుతున్నాయి. మా పార్టీ అధినేత జగన్ గారు ప్రెస్ మీట్లో డీఎస్సీపై కొన్ని ప్రశ్నలు సంధించి, యువతకు సమాధానం కావాలని ప్రభుత్వాన్ని అడిగారు. దీనికి స్పందించి ఒకాయన చర్చకు రమ్మంటాడు, మరో వ్యక్తి వీరంగాలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, శాఖాధిపతులు వచ్చి డీఎస్సీపై వివరణలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. డీఎస్సీ అభ్యర్ధులు అడుగుతున్నది ఏంటీ, వీళ్లు చెప్తున్న సమాధానాలేంటి ? విద్యాశాఖకు చెందిన సీనియర్ అధికారుల్లో అజయ్ జైన్ ఇప్పటికై రిటైర్ అయ్యారు, మరో అధికారి కోన శశిధర్ ను వేరే శాఖకు బదిలీపై పంపారు. మిగిలిన అధికారిణులు తమీమ్ అన్సారియా, భరణి ఇద్దరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మెరిట్ లిస్ట్ లు చూసుకోవచ్చు, ఎన్ని లక్షల మంది రాశారు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్తున్నారు. ఇదంతా అప్పుడే ప్రకటించి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు కదా. ఇప్పుడు అక్టోబర్ లో మరో డీఎస్సీ వస్తుంది. నోటిఫికేషన్ ఇస్తాం, అభ్యర్ధులు ప్రిపేర్ కాకుండా ఆందోళనకు గురిచేస్తున్నారని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. అసలు ఆందోళన అంతా ఇక్కడే ఉంది. మాజీ విద్యాశాఖ మంత్రిగా మాట్లాడుతున్నాను. 2025 డీఎస్సీలో ఇబ్బందులు వచ్చాయి కాబట్టి, 2026లో జరిగే డీఎస్సీపై నమ్మకం కలిగించేలా మీ వివరణ ఉంటే బాగుంటుందని మేం భావిస్తున్నాం. డీఎస్సీ అక్రమాలకు ఆధారాలివిగో.. డీఎస్సీ జరిగేటప్పుడు విద్యాశాఖ కమిషనర్ తాను దీన్ని నిర్వహించలేనని చెప్పారా ?, చెప్తే మీరు బయటపెట్టాలి. కానీ మీరు డీఎస్సీని తీసుకెళ్లి ఎస్సీఈఆర్టీకి ఇచ్చేశారు. ప్రతీ పరీక్షకీ ఓ కన్వీనర్ కూడా ఉంటారు. అతన్ని కూడా పక్కనబెట్టారని సమాచారం. ఎస్సీఈఆర్టీ కమిషనరేట్ దీనికి పనికిరాదా అని చెప్పకండి, ఎందుకంటే అది కూడా విద్యాశాఖ పరిధిలోకే వస్తుంది. ఔట్ సోర్సింగ్ విభాగం సేవల్ని ప్రశ్నాపత్రాల తయారీకి వాడారు. అక్కడ లీకేజీకి బీజం పడిందని మాతో పాటు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. కానీ మీరు అసలు తప్పులే జరగలేదంటున్నారు. ఏపీ మెగా డీఎస్సీ 2025 మెరిట్ లిస్ట్ అని మీరు ప్రకటించిన దానిలోనే ఫస్ట్ ర్యాంకర్ గా ఎండీఎస్సీ 0156824 నవీన్ పురమ వచ్చారు. అతని తండ్రి రాధాకృష్ణ. ఆఖరి కాలంలో ర్యాంక్ అని ఉంది. అందులో జోన్ 2లో ఇతను మొట్టమొదటి స్ధానం పొందాడు. కృష్ణాజిల్లాలో సోషల్ స్టడీస్ లో అతను టాప్ ర్యాంకర్ గా వచ్చాడు. తెలుగులోనూ జోన్ 2లో ఆరో ర్యాంక్ లో వచ్చాడు. అదే కృష్ణాజిల్లాలో మరో లిస్ట్ తయారు చేసి విడుదల చేశారు. ఇందులో ఒకటో ర్యాంక్ లో ఉన్న నవీన్ పేరు లేదు. రెండో పేరులో ఉన్న కోలా రామాంజనేయులు మొదటి ర్యాంక్ లోకి వచ్చాడు. ఒకటో ర్యాంక్ సంపాదించిన వ్యక్తికి ఉద్యోగం రాకుండా రెండో ర్యాంక్ సాధించిన వ్యక్తికి మొదటి ర్యాంక్ లో ఉద్యోగం ఎలా వచ్చిందనేది మా అభ్యంతరం. దీనిపై సదరు మొదటి ర్యాంక్ అభ్యర్ధి నవీన్ కోర్టుకు కూడా వెళ్లాడు. కోర్టులో కేసు వేసినా నవీన్ కు ఉద్యోగం ఇవ్వకుండా కోలా రామాంజనేయులుకు ఆ ఉద్యోగం ఇచ్చారు. తప్పు జరిగిందని దీన్ని బట్టి అర్దమవుతోంది. అడిగితే మేం పారదర్శకంగా, బాధ్యతగా డీఎస్సీ నిర్వహించామని చెప్తున్నారు. అక్రమాల పుట్టగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ పరీక్ష నిర్వహించిన వ్యవస్ధలో ఉన్న వ్యక్తికే టాప్ ర్యాంక్ వస్తే దీన్ని ఎలా అర్దం చేసుకోవాలి, అతని పేరును మీరు తీసేస్తే దాన్ని ఎలలా అర్దం చేసుకోవాలో కూటమి నాయకులు, ప్రభుత్వం చెప్పాలి. దీన్ని గుర్తించి బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది. దీనిపై విచారణ కూడా చేయించడం లేదు. నీట్ లో పేపర్ లీక్ జరిగి, కోట్ల రూపాయలు చేతులు మారాయని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని అర్దమవుతున్నా అర్దం కానట్లు నటిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హత ఉండటంతో పాటు పోటీ పరీక్షకు ఉండాల్సిన అర్హతలు ఉంటే ఉద్యోగాలు ఇవ్వాలి. 2 శాతంగా ఉన్న కోటాను 3 శాతానికి మీరే పెంచారు. మీ విపరీతమైన ప్రోత్సాహంతో కామన్వెల్త్ క్రీడల్లో ఏపీకి ఎన్ని పతకాలు వచ్చాయో చూస్తే అర్దమవుతోంది. జీవోలు 4, 47 జీవోల్లో మీరే స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచడంతో పాటు, వీరు ఎలాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదన్నారు. తిరిగి జీవో నంబర్ 56లో పరీక్ష పెట్టాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మధ్య కాలంలోనే స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయని అభ్యర్ధులు అనుమానిస్తున్నారు. ఇదే అడిగితే మీకు కోపం వస్తోంది. ఆర్చరీలో దేశంలోనే తొలి స్ధానంలో వచ్చిన క్రీడాకారుడికి ఉద్యోగం రావాలి, కానీ కేవలం పోటీల్లో పాల్గొన్న వారికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వాళ్లను చూస్తే ఉత్తర అమెరికా ఖండంలో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొన్నారని ఉద్యోగం ఇచ్చారు. కానీ చివరికి అనంతపురంలో జరిగిన సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ సమర్పించారు. ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వారి రాజకీయ, సామాజిక నేపథ్యాలు చూస్తే ఇందులో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. సాప్ట్ బాల్ లో 35 మందికి, జూడోలో 39 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ సాఫ్ట్ బాల్ సంఘానికి ఎమ్మెల్యే రవికుమార్, జూడో సంఘానికి ఎంపీ భరత్ అధ్యక్షులుగా ఉన్నారు. 10-15 లక్షలు చేతులు మారి ఉద్యోగాలు వచ్చాయని ఆడియో కాల్ రికార్డులు కూడా బయటికి వచ్చాయి. ఈ ఫోన్ కాల్ లో ఫోన్ నంబర్ కనిపిస్తున్నా.. ప్రభుత్వం అది ఎవరిదో గుర్తించి చర్యలు తీసుకోలేకపోయింది. డీఎస్సీపై మండలిలో చర్చకు సిద్దం కండి.. చంద్రబాబు మీడియాతో చేసిన చిట్ చాట్ లో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పారు. అది లేదనేదే ప్రజల అభ్యంతరం. మీ ధర్నాచౌక్ లోనే మా నాయకులు ధర్నా చేస్తుంటే, మీ ఎమ్మెల్యేలు పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వంటి వారికి గాయాలయ్యాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులు కాలరాయడం కాదా ?, సుప్రీంకోర్టు కూడా శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని ఈ మధ్యే గుర్తుచేసింది. నిరాహారదీక్షకు కూర్చొన్న వారితో ప్రజలకు ఏం ఇబ్బంది ఉందని అడ్డుకుంటున్నారు. అంటే ఇబ్బంది ప్రజలకు కాదు మీకే అని అర్దమవుతోంది. నిరసనలు ఎక్కడ చేయాలో తేల్చుకునే హక్కు ప్రజలకు ఉంది. వాటి వల్ల శాంతిభద్రతలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి వెంట తరలివస్తున్న వేలాది యువకుల్ని చూసి, అన్యాయాన్ని ప్రశ్నించే యువత రాష్ట్రంలో ఉందని గర్వపడాల్సింది పోయి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం దారుణం. డీఎస్సీలో ఉద్యోగాలు రాని వారు ప్రశ్నిస్తుంటే, వాళ్లను ఉద్యోగాలు వచ్చిన వాళ్లతో గొడవలు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు విడుదల చేసిన ఆర్దికశ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని చెప్పుకుంటున్నారు. అవును నిజమే. లక్షల కోట్లు అప్పులు తెచ్చి, వాటికి సరైన లెక్కలు చెప్పలేకపోతున్నారని, కనీసం ఎన్నికల హామీలు కూడా నిలబెట్టుకోవడం లేదని అర్ధమైంది. ప్రజలకు అందరూ అన్నీ చెప్పాలి. వాళ్లే వాస్తవాలు నిర్ధారించుకుంటారు. కానీ నిర్ధారించుకున్నాక ప్రశ్నిస్తున్న వారిపై దమనకాండకు దిగొద్దని కోరుతున్నాం. సీఎం మెప్పు కోసం కూటమి నాయకులు విమర్శలు, దాడులకు దిగుతున్నారు. ఇందులో కొత్తేమీ లేదు. కాబట్టి డీఎస్సీ అక్రమాలపై ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుందామంటే కుదరదు. విద్యామంత్రి లోకేష్ దీనిపై సమాధానం చెప్పాల్సిందే. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలిలో దమ్ముంటే డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు రావాలని, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సాకే శైలజానాథ్ కూటమి సర్కార్ కు సవాల్ విసిరారు.