తాడేపల్లి: తన కుటుంబ సంస్థ 'హెరిటేజ్' డెయిరీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే చంద్రబాబు, నారా లోకేష్ లు కుట్ర పన్ని సహకార రంగంలోని 'విజయా డెయిరీ'ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయా డెయిరీ అనేది మ్యాక్స్ చట్టం కింద రైతులు దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న స్వయంప్రతిపత్తి గల సంస్థ అని, దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి విజయా డెయిరీ డైరెక్టర్లను మచిలీపట్నంలో నిర్బంధించడంతో పాటు, అనారోగ్యంతో ఆసుపత్రి ఐసీయూలో ఉన్న చైర్మన్ చలసాని ఆంజనేయులును బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆస్తి అయిన విజయా డెయిరీని కబళించాలని చూస్తే రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అరాచకానికి పాల్పడిన మంత్రులు, చంద్రబాబు, లోకేష్ తక్షణమే రాష్ట్ర ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలో విజయ డెయిరీ చైర్మన్ టీడీపీకి చెందిన వారైనా ఏనాడూ రాజకీయ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. చిత్తూరు, ఒంగోలు డెయిరీల మాదిరిగానే లాభాల్లో ఉన్న ఈ డెయిరీని కూడా అప్పులపాలు చేసి, పూర్తిగా హెరిటేజ్ పరం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల బుడమేరు వరదల్లో సుమారు రూ. 20 కోట్ల నష్టం వచ్చినా విజయా డెయిరీ నిలదొక్కుకుని సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ఇవ్వడమే కాకుండా, ప్రత్యామ్నాయ ప్లాంట్ ద్వారా ప్రజలకు నిరంతరాయంగా పాలు సరఫరా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1. చట్టప్రకారం ఎన్నికైన విజయా డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చేత ఎందుకు బలవంతంగా రాజీనామా చేయించారు? 2. 'అధిష్టానం ఆదేశం' అని చెప్పి, మంత్రులు రంగంలోకి దిగి ఆసుపత్రి ఐసీయూలో మూడు గంటలు ఉండి ఆయనను కేసుల్లో ఇరికిస్తామని బెదిరించిన మాట వాస్తవం కాదా? 3. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు రైతులు ఎన్నుకున్న డైరెక్టర్లను మంత్రి కొల్లు రవీంద్ర ఇంట్లో బంధించి, వారి కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని బెదిరించిన మాట నిజం కాదా? 4. ప్రభుత్వం, మంత్రులు రైతుల మీద, వారి సంస్థల మీద కూడా మీ 'రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని' ఎందుకు ప్రయోగిస్తున్నారు? 5. ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని, సహకార వ్యవస్థలో కొనసాగే విజయా డెయిరీ మీద మీరెందుకు కన్నేశారు? ఆస్తుల విధ్వంసం, వ్యవస్థల నిర్వీర్యం కూటమి ప్రభుత్వం ఒకవైపు వ్యవస్థలను నాశనం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ ఆస్తులైన మెడికల్ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు, ఆర్టీసీ స్థలాలను పప్పు బెల్లాల్లాగా తమ వారికి అమ్మేసుకుంటూ దోచుకుంటోందని ఆయన విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో గ్రామాల్లో సాగునీరు, యూరియా, డీఏపీ అందక రైతన్నలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలోనూ పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కట్టబెడుతూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను పక్కనపెట్టి, ప్రశ్నించిన వారిపై 'రెడ్‌బుక్ రాజ్యాంగం' పేరుతో అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కుతున్నారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజమెత్తారు.