తాడేపల్లి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని రాజకీయ కక్ష సాధింపులకు లక్ష్యంగా చేసుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. ఒక తల్లిగా, భార్యగా తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ శ్రీదేవి అడిగిన సూటి ప్రశ్నలకు ఇప్పటివరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్నారు. నిజాలు తమవైపు ఉంటే సమాధానం చెప్పకుండా మౌనం ఎందుకని ప్రశ్నించారు. చెప్పుల జోగయ్య కేసును రీఓపెన్ చేసి స్వతంత్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు. ఒకే తరహా ఘటనల్లో అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అమలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆరె శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో ఆరె శ్యామల ఏమన్నారంటే.. - కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయమా? రాజకీయ విభేదాలు ఉంటే సీదిరి అప్పలరాజు గారిని రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేకానీ ఆయన కుటుంబంపై నిందలు వేయడం, పిల్లలను రాజకీయాల్లోకి లాగడం, కుటుంబాన్ని వేధించడం ఏ న్యాయం? శ్రీదేవి గారు రాజకీయ నాయకురాలిగా కాదు.. ఒక తల్లిగా, భార్యగా, మహిళగా తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు ఉంచారు. ఆమె అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. నిజాలు మీ వైపు ఉంటే సమాధానం చెప్పగలిగేవారు. సమాధానం లేకపోవడమే అన్నింటికీ సమాధానం. - చెప్పుల జోగయ్య కుటుంబానికి న్యాయం ఎక్కడ? 2024 డిసెంబర్ 21న పాతపట్నం నియోజకవర్గంలోని కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పుల జోగయ్య గారు మృతి చెందారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ వాహనం నడిపారని బాధితులు చెబుతున్నారు. డ్రైవర్ పేరు మార్చి కేసును ఇతరులపై మళ్లించారని బాధిత కుటుంబం చెబుతోంది. రూ.5 లక్షల సాయం, గాయపడిన వారికి సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చారు. దాదాపు 20 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా ఎందుకు అమలు కాలేదు? మీకు చట్టంపై నమ్మకం ఉంటే జోగయ్య కేసును రీఓపెన్ చేసి స్వతంత్ర విచారణ జరిపించండి. అసలు ఎవరు వాహనం నడిపారు? కేసులో ఎవరి పేరు ఎందుకు పెట్టారు? బాధిత కుటుంబానికి ఎవరు ఏ హామీ ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్షానికి మరో చట్టం ఉండకూడదు. - శ్రీదేవి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? జోగయ్య కేసును రీఓపెన్ చేస్తారా? బాధితుల ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపిస్తారా? కుటుంబానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తారా? సీదిరి అప్పలరాజు కుటుంబానికి వర్తింపజేస్తున్న చట్ట ప్రమాణాన్నే అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబానికి కూడా వర్తింపజేస్తారా? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కేసులు, అరెస్టులు, బెదిరింపులతో కొంతకాలం గొంతు నొక్కవచ్చు. కానీ నిజం ఎప్పటికీ జైల్లో ఉండదు. బాధిత కుటుంబాల పక్షాన వైయస్సార్‌సీపీ ఎప్పుడూ నిలబడుతుంది. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది.