లోకేష్ ధ‌న దాహానికి విజ‌యా డెయిరీ బ‌లి

డెయిరీ వ్య‌వ‌హారాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం? 

సూటిగా ప్ర‌శ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని 

మ‌చిలీప‌ట్నం: కోస్తాంధ్ర జిల్లాల్లో హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, లాభాల్లో న‌డుస్తున్న 'విజయా డెయిరీ'ని సర్వనాశనం చేసి కబళించాలన్నదే చంద్రబాబు, లోకేష్ ల ప్రధాన కుట్ర అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం మ‌చిలీప‌ట్నంలో త‌న‌ను క‌లిసిన మీడియాతో ప్ర‌తినిధుల‌తో ఆయ‌న మాట్లాడారు. విజ‌యా డెయిరీ చైర్మ‌న్ చ‌ల‌సాని ఆంజ‌నేయుల‌తో మంత్రులు బ‌ల‌వంతంగా రాజీనామా చేయించార‌ని మండిప‌డ్డారు. మ్యాక్స్ చట్టం (కంపెనీ యాక్ట్) కింద నడుస్తున్న విజయా డెయిరీ అనేది ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవి కాదని, రైతులు తమకు తాముగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకునే ఒక సహకార వ్యవస్థ అని స్ప‌ష్టం చేశారు. ఈ సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే కనీస అధికారం ప్రభుత్వానికి గానీ, మంత్రులకు గానీ ఏమాత్రం లేదని, అయినా సరే చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కారని ధ్వ‌జ‌మెత్తారు. విజయా డెయిరీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఎన్నికైన గంటలోనే, లోకేష్ ఆదేశాలతో ఇద్దరు మంత్రులు పార్థ‌సార‌థి, కొల్లు ర‌వీంద్ర‌ అక్కడికి వెళ్లి దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...  

చైర్మన్ చ‌ల‌సాని ఆంజనేయులును తీవ్రస్థాయిలో బెదిరిస్తూ ఆయనపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. "నీ కూతురిని జైల్లో వేస్తాం, అమెరికాలో ఉన్న నీ కొడుకుని రప్పించి మరీ జైలుకు పంపుతాం, నిన్ను కూడా రెండు మూడేళ్ల పాటు జైల్లో పెట్టి చిప్పకూడు తినిపిస్తాం" అని దారుణంగా మానసిక క్షోభకు గురిచేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో ఐసీయూలో చేరితే, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించారు. ఆ ఇద్దరు మంత్రులు దొడ్డిదారిన ఆసుపత్రిలోకి కూడా వెళ్లి అరుపులు, కేకలతో దౌర్జన్యం చేసి ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారు. కరడుగట్టిన టీడీపీ కార్యకర్త అయిన ఆంజనేయులును కూడా వదలకుండా, కేవలం హెరిటేజ్ కోసం సొంత పార్టీ వాళ్లనే పాము తన పిల్లల్ని తిన్నట్టు మింగేస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ గారు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఏ డెయిరీల జోలికి మేము వెళ్లలేదు, వాటిని స్వేచ్ఛగా బతకనిచ్చాం. కానీ, హెరిటేజ్ కోసం విజయా డెయిరీని అప్పులపాలు చేసి నాశనం చేయాలని చూస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. లోకేష్ మాటలు విని, వారికి చెంచాగిరీ చేస్తూ విజయా డెయిరీ కుర్చీలో కూర్చుని తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్కరికీ నేను సూటిగా హెచ్చరిస్తున్నాను. రాబోయే రెండున్నర, మూడేళ్లలో వైఎస్ జ‌గ‌న్ గారు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు రైతుల ఆస్తి అయిన విజయా డెయిరీని నాశనం చేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరినీ ఖ‌చ్చితంగా జైలుకు పంపుతాం, వారంద‌రితో జైలు ఊచలు లెక్కపెట్టించ‌డం ఖాయమ‌ని హెచ్చరిస్తున్నాను.

Back to Top