పల్నాడు: డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేటలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి విడదల రజిని, నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు శిబిరం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో మాజీ మంత్రి విడదల రజినికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో విడదల రజిని కిందపడిపోయారు. మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం పోలీసులు పార్టీ నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, డీఎస్సీ పోస్టులను సంతలో కూరగాయల్లా అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు శిబిరాలను తొలగించడం, మైకులు లాగేయడం, కేసులు పెడతామని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తున్న వాస్తవాలతో ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు కల్పించినా నిరసన దీక్షలను కొనసాగిస్తామని విడదల రజిని స్పష్టం చేశారు.