తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌ను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ (NAMTA) ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. వాహన యజమానులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రం అందజేశారు. నెక్ట్స్ జనరేషన్ వాహన్ (పరివాహన్) వ్యవస్థ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు తెలిపారు. ఈ సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని శ్రీ వైయస్ జగన్‌ను కోరారు. 2024లో చట్టబద్ధంగా వాహనాలు కొనుగోలు చేసిన కొత్త యజమానులు, 2018 నుంచి పూర్వ యజమానుల కాలంలో నమోదైన కేసులు, పెండింగ్ చలానాలు, బ్లాక్‌లిస్ట్‌ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వాహనం కొనుగోలు చేసిన కొత్త యజమానులకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పాత యజమానుల కేసులు, బకాయిలను చెల్లించాలంటూ రవాణాశాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాహనాల బదిలీ, పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇతర రవాణాశాఖ సేవలు నిలిచిపోతున్నాయని తెలిపారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS) పేరుతో వాహన యజమానులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నారని నమత ప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లాకు ఒకే ఏటీఎస్ కేంద్రం ఉండటంతో వాహనాలను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఇంధనం, టోల్ ఛార్జీలు, డ్రైవర్ ఖర్చులు, వాహనం నిలిచిపోయే రోజుల కారణంగా అదనపు నష్టం కలుగుతోందని వివరించారు. ఏటీఎస్ కేంద్రాల వద్ద ఏజెంట్ల ప్రమేయంతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందేందుకు అధికారిక రుసుములతోపాటు ఇతర ఖర్చులు కలిపి ఒక్కో వాహన యజమాని సుమారు రూ.20 వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో అదనపు ఏటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. నమత ప్రతినిధులు వివరించిన సమస్యలను శ్రీ వైయస్ జగన్ సావధానంగా విన్నారు. వేలాది వాహన యజమానులు, డ్రైవర్లు, వారి కుటుంబాల జీవనోపాధికి సంబంధించిన ఈ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తామని, వాహన యజమానులపై అన్యాయమైన ఆర్థిక భారం తొలగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి పార్టీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీ వైయస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. శేషగిరితోపాటు పలువురు యూనియన్ ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు.