రాష్ట్రంలో లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం..

పోలీసులను పావులుగా వాడుకుంటూ అక్రమ కేసులు

హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి తప్పుడు రికార్డుల సృష్టి

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరుపై  వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం
తిరుపతి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

రెడ్‌బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు

కరుణాకర్‌ రెడ్డిపై కక్ష సాధింపు

ఒకే క్రైమ్‌ నంబర్‌తో రెండు ఎఫ్‌ఐఆర్‌లు

ఎఫ్‌ఐఆర్‌ డిలీట్‌ చేసి మళ్లీ కేసు

పోలీస్‌ వ్యవస్థను మేనేజ్‌ చేస్తున్నారా?

సూటిగా ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డి

సీఐని బలిపశువును చేసిన ప్రభుత్వం

కోర్టు ఆదేశాల తర్వాత కేసుల మాయాజాలం

లోకేష్‌ ఆదేశాలతో వ్యవస్థల దుర్వినియోగం

కలెక్టర్‌ ఫిర్యాదుతో మొదలైన కేసు మాయం

కలెక్టర్‌ భాషపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం

సీఐపై చార్జ్‌మెమోతో అసలు కథ

24 గంటల్లో హాజరు పర్చాలన్న నిబంధనకు తూట్లు

53 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంపై కక్ష

ప్రభుత్వ తీరుపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆక్షేపణ

తిరుపతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, నారా లోకేష్‌ల ఆదేశాలతో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు సంవత్సరాల మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, పోలీసులను పావులుగా వాడుకుంటూ తప్పుడు ఎఫ్ఐఆర్‌లు సృష్టించి ప్రభుత్వం ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టిందో ఆధారాలతో సహా కూటమి ప్రభుత్వ తీరును  ఆయన మీడియా ముందు ఎండగట్టారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే...

- రెండేళ్లుగా నాపై కక్షసాధింపు – కలెక్టర్ ద్వారా తప్పుడు లేఖలు..

చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్లుగా నన్ను నిరంతరం వెంటాడుతూ, వేటాడుతూ అక్రమ కేసులు బనాయిస్తోంది. నా కుటుంబానికి చెందిన భూముల విషయంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చేత ఎస్పీకి లేఖ రాయించారు. 22-07-2026న కలెక్టర్ రాసిన ఆ లేఖలో నన్ను ‘గుండా’ అని సంబోధిస్తూ ‘కరుణాకర్ రెడ్డి అండ్ గూన్స్’ అనే పదజాలం వాడటం అత్యంత దుర్మార్గం. దాని ఆధారంగా 11-08-2026న ఎస్పీ గారు తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు ఒక మెమో జారీ చేశారు.

- కలెక్టరే ఫిర్యాదుదారుడిగా కేసు – హైకోర్టు మొట్టికాయలు..

ఎస్పీ మెమో ఆధారంగా ఆగస్టు 12న కలెక్టరే కంప్లైనెంట్‌గా నాపై క్రైమ్ నంబర్ 253/2026 కింద కేసు నమోదు చేసి వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిపై మేము హైకోర్టును ఆశ్రయించగా, కలెక్టర్ ఉపయోగించిన భాషపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాపై తదుపరి చర్యలు ఏవీ తీసుకోకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

- ఆన్‌లైన్ నుంచి ఎఫ్ఐఆర్ మాయం – లోకేష్ రెడ్ బుక్ ఎంట్రీ..

హైకోర్టు ఆదేశాలతో కంగుతిన్న ప్రభుత్వం వెంటనే రంగంలోకి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దించింది. ఆగస్టు 12న నమోదైన ఎఫ్ఐఆర్‌ను ఆగస్టు 13 సాయంత్రానికల్లా ఆన్‌లైన్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేశారు. విజయవాడలో సాయికృష్ణను మాయం చేసినట్లే, పోలీసు రికార్డుల్లో ఉన్న ఎఫ్ఐఆర్‌ను సైతం మాయం చేసేశారు. తప్పు జరిగిందని ఈనాడు లాంటి పత్రికల్లో రాయించుకుని, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో కొత్త డ్రామాకు తెరలేపారు.
తమ తప్పును సరిదిద్దుకునే క్రమంలో  తిరుచానూరు సీఐని బెదిరించి, లొంగదీసుకుని చార్జ్ మెమో ఇచ్చారు. అనంతరం తనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 478 భూమికి సంబంధించి చెరుకూరి వెంకట ప్రసాద్ అనే ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి, అతనితో నాపై బలవంతంగా ఫిర్యాదు చేయించారు. విచిత్రం ఏమిటంటే.. కలెక్టర్ ఇచ్చిన పాత కేసు క్రైమ్ నంబర్ (253/2026) పైనే సెక్షన్లు మార్చి ఈ కొత్త కేసును కూడా రిజిస్టర్ చేశారు.

- ఒకే సమయం.. రెండు ఎఫ్ఐఆర్‌లు: సీసీ కెమెరా ఫుటేజ్ చూపగలరా?

కలెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆగస్టు 12 సాయంత్రం 5 గంటలకు రిజిస్టర్ అయితే, ప్రైవేట్ వ్యక్తి వెంకట ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్ కూడా సరిగ్గా ఆగస్టు 12 సాయంత్రం 5 గంటలకే నమోదైనట్లు రికార్డులు సృష్టించారు. ఒకే క్రైమ్ నంబర్‌తో, ఒకే సమయంలో రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు ఎలా నమోదవుతాయి? ఆగస్టు 12 సాయంత్రం 5 గంటలకు వెంకట ప్రసాద్ తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు పీఎస్ సీసీ టీవీ ఫుటేజ్ చూపించగలరా ? అని లోకేష్‌కు, పోలీసులకు సవాల్ విసురుతున్నాను. అతన్ని వేరే రోజు పిలిపించి, 12వ తేదీగా బ్యాక్ డేట్ వేసి తప్పుడు రికార్డులు రాశారు.

- కోర్టుకు ఎఫ్ఐఆర్ సమర్పణలోనూ అక్రమాలు..

చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లోగా మేజిస్ట్రేట్‌కు చేర్చాలి. కానీ ఆగస్టు 13 మధ్యాహ్నం 2:25 గంటలకు పంపినట్లు రికార్డుల్లో రాసి, తిరుచానూరు నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టుకు సాయంత్రం 6:30 గంటలకు హెడ్ కానిస్టేబుల్ ద్వారా చేర్చారు. 45 నిమిషాల్లో నడిచి వెళ్లగలిగే దూరానికి నాలుగున్నర గంటల సమయం తీసుకుని రికార్డులను తారుమారు చేస్తూ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేశారు. ల్యాండ్ గ్రాబర్లకు అభయమిచ్చి నాపై ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఫిర్యాదుదారుడు చెరుకూరి వెంకట ప్రసాద్‌పై ఇప్పటికే పలు ల్యాండ్ గ్రాబింగ్, సివిల్ కేసులు ఉన్నాయి. అతని సివిల్ వివాదాలపై హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చింది. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి పిలిపించి.. 'నీపై ఉన్న కేసులను మా నాయకుడు లోకేష్ చూసుకుంటారు' అని అభయమిచ్చి నాపై తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారు. ఒక నీతిపరుడైన సీఐని బలిపశువును చేసి ఈ తతంగం నడిపారు.

- న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతుంది..

ఈ నేపధ్యంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ తప్పుడు రికార్డుల సృష్టిపై తాను మళ్లీ హైకోర్టు తలుపు తడతానని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.  53 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా, తుడా చైర్మన్‌గా నిజాయితీగా పనిచేసిన నాపైనే గుండా, ల్యాండ్ గ్రాబర్ అంటూ ఇంతటి కక్షసాధింపులకు పాల్పడుతుంటే రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం ఎలా దక్కుతుందని  వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.  ప్రజలకు మేలు చేయాల్సిన వ్యవస్థలన్నింటినీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలకు వాడుకుంటోందని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

 

Back to Top