నా ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకు పోరాడతా

గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు తన నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవిక చర్య అని, ఘటన జరిగి ఇంత సమయం గడిచినా పోలీసులు ఒక్కరినీ అరెస్టు చేయలేదని విమర్శించారు. గురువారం గుంటూరులోని పార్టీ కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని నెలల తరబడి జైలులో ఉంచుతున్న ప్రభుత్వం, తన ఇంటిపై దాడి చేసిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేస్తానని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతానని చెప్పారు. ఈ దాడి వల్ల తన కుటుంబ సభ్యులు ప్రాణభయంతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రధాన కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు.  "24 గంటల్లో అంబటికి సినిమా చూపిస్తాం"   అని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతోనే ఈ కుట్రకు బీజం పడిందని అన్నారు. "అమెరికాలో వేల కోట్లు సంపాదిస్తే చట్టం నుంచి తప్పించుకుంటానని అనుకుంటే కుదరదు. నాకు సినిమా చూపించామని భావిస్తున్నావు... ఇప్పుడు భారతదేశ చట్టాలు ఎంత పదునుగా ఉంటాయో నీకే చూపిస్తాం"  అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ధనమదం, అధికార మదంతో వ్యవహరిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై విమర్శలు గుప్పించారు. ఘటనలో బాధ్యులందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Back to Top