న్యూఢిల్లీ: ఏపీలో కూటమి సర్కార్ డీఎస్సీ ఉద్యోగాల భర్తీ పేరుతో చేసిన స్కాంపై వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనలకు దిగారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో డీఎస్సీ స్కాం అంశాన్ని లేవనెత్తారు. ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 'పేపర్ లీకేజీ నిరోధక బిల్లు'పై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, ఆ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించడంతో పాటు, దీని పరిధిని రాష్ట్ర స్థాయి నియామక, ప్రవేశ పరీక్షలన్నింటికీ విస్తరించాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాలలో తీవ్ర అక్రమాలు జరిగాయని వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభకు తెలిపారు. డీఎస్సీలో టీచర్ పోస్టుల అమ్మకం, ఎంపిక ప్రక్రియలో మార్పులు, ప్రశ్నాపత్రం లీకేజీ వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ కూడా పదవి నుంచి తప్పుకోవాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన పేపర్ లీక్ ల నిరోధక చట్టం కేవలం యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఎన్టీఏ నిర్వహించే పరీక్షలకే పరిమితం కాకూడదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. పరీక్షా విధానంపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఏపీపీఎస్సీ, డీఎస్సీ, ఏపీ ఎప్ సెట్ వంటి రాష్ట్ర స్థాయి సంస్థలు, పరీక్షల్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పేపర్ లీకేజీలలో కోచింగ్ సెంటర్ల మాఫియా కీలక పాత్ర పోషిస్తోందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాపరమైన అసమానతల గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్ర సిలబస్‌ను అనుసరించే విద్యార్థుల కంటే నీట్ పరీక్షలో సీబీఎస్ఈ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోందని సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టి, వాటిని ఆధునీకరించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసిందని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 5.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వచ్చారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరిస్తూ వైద్య విద్యను పేదలకు అందకుండా చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.