రాజమండ్రి: అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ బాధితులైన పెనుమాక రైతులకు భరోసా ఇచ్చేందుకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో భౌతిక దాడులకు తెగబడటాన్ని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతా మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ప్రధాన అనుచరుడైన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడి ఆధ్వర్యంలో కార్లను ధ్వంసం చేసి, నేతలపైనే కాకుండా అడ్డువచ్చిన పోలీసులపై సైతం హత్యాయత్నానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన అధికార పార్టీ గుండాలను వదిలేసి, బాధితులైన వైయస్ఆర్‌సీపీ నేతలపైనే అక్రమంగా రివర్స్ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి, నారా లోకేష్ నిర్దేశించిన 'రెడ్ బుక్' సెక్షన్ల ప్రకారం అరాచక పాలన సాగిస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైయస్ఆర్‌సీపీ నేతలు, దళితులు, బీసీలపై అక్రమ కేసులు, భౌతిక దాడులతో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. - అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు – రెడ్ బుక్ పాలన.. రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదు, కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా తుంగలో తొక్కింది. ఏపీ పోలీసు శాఖ ఐపీసీ సెక్షన్లను పక్కనబెట్టి, మంత్రి నారా లోకేష్ తన 'రెడ్ బుక్' లో స్పష్టం చేసిన అక్రమ సెక్షన్ల ప్రకారమే వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి, తాము రెడ్ బుక్ కాకుండా భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నామని ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు, తన కుమారుడు లోకేష్‌ను మందలించాలి. - విజయవాడ సాయికృష్ణ హత్య ఉదంతం – కూటమి నేతల మౌనం.. విజయవాడకు చెందిన యువకుడు సాయికృష్ణను దారుణంగా హతమార్చి, అతని దేహాన్ని అనాథ శవం కింద బస్టాండ్‌లో పడేశారు. మాజీ సీఎం వైయస్.జగన్ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకుని రాకపోతే జరిగిన దారుణం కూడా బయటకు రాని పరిస్థితి. సాయికృష్ణ ని ఒక అనాథ శవం కింద తగులబట్టిన పరిస్థితులు చూస్తున్నాం. కుటుంబ సభ్యులకు కనీసం బూడిద కూడా అందని దౌర్బాగ్య పరిస్థితి. ఇంత జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా ఈ లాకప్ డెత్ గురించి కానీ, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడి గురించి కానీ మాట్లాడకపోవడం సిగ్గుచేటు. - శాంతిభద్రతలు గాలికి – మేకప్‌పైనే శ్రద్ధా? రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అధికార పార్టీ కార్యకర్తలు పోలీసులపై కూడా రాళ్లు విసురుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హోంమంత్రి అనిత తన వ్యక్తిగత అంశాలపై, మేకప్‌లపై చూపిస్తున్న శ్రద్ధలో కొద్దిగానైనా రాష్ట్ర రక్షణపై పెడితే బాగుండేది. హోంమంత్రి మేకప్ అంశంపై పెద్ద ఎత్తున స్పందించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఏపీలోని యువకుల ప్రాణాల మీద ఎందుకు శ్రద్ధ లేదు?."నా చేతిలో హోం శాఖ లేదు" అని పవన్ కళ్యాణ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి ఉమ్మడి బాధ్యత లేదా, మీరు ప్రభుత్వం భాగం కాదా? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంతం నానాజీ మాటలను వెనకేసుకురావడం దారుణం. - అమరావతిలో దౌర్జన్యాలు .. అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి అక్రమంగా, దౌర్జన్యంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములు తీసుకోవాలి, బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే బాధ్యత గల ప్రతిపక్షంగా కచ్చితంగా ప్రతిఘటిస్తాం. పెనుమాక రైతుల ఆహ్వానం మేరకే, వారికి భరోసా ఇచ్చేందుకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై టీడీపీ గూండాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. దాడులకు పాల్పడిన టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. - బీసీ నేతలపై కక్షసాధింపు – ప్రభుత్వ బాధ్యతారాహిత్యం.. రాజమండ్రిలో ఒక శెట్టిబలిజ (బీసీ) యువకుడిపై కక్షపూరితంగా పీడీ యాక్ట్ పెట్టి, నడిరోడ్డుపై ఒక టెర్రరిస్టును తీసుకెళ్లినట్లు అరెస్టు చేయడం దుర్మార్గం. చీటికి మాటికి విపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేయొద్దని హైకోర్టు సైతం కూటమి ప్రభుత్వానికి గట్టిగా చీవాట్లు పెట్టింది. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై న కూడా లోకేష్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అక్రమ చర్యకూ భవిష్యత్తులో ప్రజల నుంచి కచ్చితంగా బలమైన ప్రతిచర్ఉంయ ఉంటుందని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని మార్గాని భరత్ హెచ్చరించారు.