కావలి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ఓ ఎస్టీ మహిళపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునే ఘటన అని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అఘాయిత్యానికి గురైన బాధిత మహిళను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డితో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత, గౌరవం గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇటువంటి ఘటనల విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించిన కాకాణి, బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేపడతామని హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏమన్నారంటే.. - సభ్య సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది కావలి పట్టణంలో ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై జరిగిన దాడి గురించి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించాం. ఆమె చెప్పిన విషయాలు వింటుంటే మనం నిజంగా సభ్య సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. మహిళలు తలెత్తుకుని జీవించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. బాధితురాలు కన్నీటి పర్యంతమై తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కుమారుడి ప్రేమ వ్యవహారం పేరుతో ఒక గిరిజన మహిళను వివస్త్రను చేసి, జుట్టు పట్టుకుని ఈడ్చుతూ కాళ్లతో, చేతులతో దాడి చేశారని వాపోయింది. దాడి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటే, నిందితులు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారని తెలిపింది. అనంతరం పోలీసులే బాధిత కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి కూర్చోబెట్టారని బాధితురాలు వెల్లడించింది . - ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరింపులు తన కుమారుడిపై ఎందుకు కేసు పెడుతున్నారని బాధిత మహిళ ప్రశ్నించగా, జరిగిన ఘటన బయటకు రాకూడదని, బయటకు వస్తే గూండా యాక్ట్ పెట్టి రౌడీషీట్ తెరిచి ఎన్‌కౌంటర్ చేస్తామని కూడా బెదిరించారని ఆమె ఆరోపిస్తోంది. గాయాలతో, అవమానభారంతో బాధపడుతున్న ఆ మహిళను ఆదుకోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి రాజీకి ఒత్తిడి తెచ్చారని చెబుతోంది. అంతేకాకుండా తహశీల్దార్ కార్యాలయంలో బలవంతంగా వేలిముద్రలు తీసుకుని ఇస్లాం మతం స్వీకరించినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తోంది 'నాకు చదువు రాదు.. ఏ పత్రాలపై సంతకాలు చేయించారో కూడా తెలియదు' అని బాధిత మహిళ చెబుతోంది. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులు, సిబ్బంది ఎవరూ తప్పించుకోలేరు. - నేరస్తులకు కాపు కాస్తున్న ఎమ్మెల్యే ఆ మహిళపై దాడి చేసిన ఇబ్రహీం గురించి స్థానికులను అడిగి తెలుసుకుంటే, ఆయన వల్ల బాధపడిన వారు ఈ కాలనీలో చాలామంది ఉన్నారని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావలికి కాపు కాస్తానని ప్రజల ఓట్లు పొందారు. ఇప్పుడు నేను ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్నాను.. మీరు కావలికి కాపు కాస్తున్నారా? లేక నేరస్తులకు కాపు కాస్తున్నారా? సమాధానం చెప్పాలి. ఒక మహిళ అఘాయిత్యానికి గురైతే ఆమెకు అండగా నిలవాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడటం బాధాకరం. మేం రాజకీయాలు చేయడానికి రాలేదు. బాధిత మహిళ మా పార్టీకి చెందిన వారు కూడా కాదు. చాలామంది ఆమె టీడీపీ సానుభూతిపరురాలని చెబుతున్నారు. మేం పార్టీలు చూడటం లేదు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మానవత్వంతో అండగా నిలవడానికే వచ్చాం. రాజకీయం చేయాలనుకుంటే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఘటనలోని వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాం. - కూటమి పాలనలో బాధితులే నిందితులు మహిళపై ఎవరైనా చేయి వేస్తే అదే వారి చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ తప్పు చేసిన వారిని శిక్షించడం బదులు వారికి అండగా నిలుస్తున్నారు. నిందితులను కాపాడుతూ బాధితులనే నిందితులుగా మార్చి, బెదిరించి రాజీ చేయించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. బాధిత కుటుంబాన్ని బెదిరించిన పోలీసులపై, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులపై విచారణ జరగాల్సిందే. ఈ ఘటన తెలిసిన వెంటనే మా నాయకుడు వైయస్ జగన్ స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. మేం రాజకీయాల కోసం రాలేదు.. ఒక మహిళకు అన్యాయం జరిగితే మానవత్వంతో స్పందించడం మా బాధ్యత. బాధిత మహిళకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయపోరాటం కొనసాగిస్తాం. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిరాధరణకు గురైన ప్రతి కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదు" అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.