మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అక్ర‌మం

కూటమి ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట 

వ‌రుదు క‌ళ్యాణి ఫైర్‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తున్న బీసీ నాయ‌కుల‌ను టార్గెట్ చేశారు

మ‌త్స్య‌కారుల గ‌ల్లంతులో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంపై ప్రశ్నించినందుకే అరెస్ట్ 

అక్ర‌మ అరెస్టుల‌తో బీసీ నాయకుల గొంతు నొక్కే కుట్ర 

కొడుకు యాక్సిడెంట్‌ కేసులో తండ్రిని అరెస్ట్‌ చేయడం ఎక్కడి న్యాయం?

రోడ్డు ప్రమాదంపై హత్యానేరం సెక్షన్లు పెట్టడం దారుణం

పోలీసు వ్యవస్థను రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుకు ఉపయోగిస్తున్నారు

అక్ర‌మ అరెస్టుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ భ‌య‌ప‌డేది లేదు 

బీసీలకు అండగా, బ్యాక్‌బోన్‌గా వైఎస్‌ జగన్ ఉన్నారు

వ‌రుదు క‌ళ్యాణి స్ప‌ష్టీక‌ర‌ణ 

తాడేపల్లి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్సీ, పార్టీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. త‌న కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసును అడ్డుపెట్టుకుని, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్‌ చేయడం రెడ్‌బుక్‌ రాజ్యాంగ అమలుకు, రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను కీలు బొమ్మగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పరాకాష్టకు చేరింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. మ‌త్స్య‌కారుల గ‌ల్లంతు స‌మ‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంపై మాజీ మంత్రి అప్ప‌ల‌రాజు ప్రశ్నించినందుకే ఈ ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అవినీతిని ప్ర‌శ్నిస్తున్న బీసీ నాయ‌కుల‌ను ఈ ప్ర‌భుత్వం టార్గెట్‌గా పెట్టుకుంద‌ని వ‌రుదు క‌ళ్యాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే...

- సీదిరి అప్పలరాజు అరెస్ట్‌ కక్ష సాధింపునకు పరాకాష్ట

కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పరాకాష్టకు చేరింద‌ని కక్షపూరిత చర్యలు చేయడంలో తాము ముందున్నామని మరోసారి నిరూపించుకున్నారు. బలహీన వర్గాల నుంచి వచ్చి డాక్టర్‌గా ప్రజలకు సేవ చేసి, ఎమ్మెల్యేగా, మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపుతున్నారనే కారణంతో ఆయన గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?’

- డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ అరెస్ట్‌

ఈ అరెస్ట్‌కు ఒకటే కారణం కనిపిస్తోంది.. డైవర్షన్‌ పాలిటిక్స్‌. మొదటి నుంచి కూటమి ప్రభుత్వానికి డైవర్షన్‌ పాలిటిక్స్‌ బాగా అలవాటు. గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నాయకుడే దాడి చేసిన ఘటనలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. జత్వాని కేసులోనూ పోలీసు అధికారులను కక్షపూరితంగా వేధించిన విషయం ప్రజలకు అర్థమైంది. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వం ఇరుకునపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీసీ నాయకుడైన సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్‌ చేశారు.’’

- కొడుకు యాక్సిడెంట్‌ చేస్తే తండ్రిని అరెస్ట్‌ చేస్తారా?

ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా కొడుకు ఒక యాక్సిడెంట్‌ కేసులో అరెస్ట్‌ అయితే తండ్రిని కూడా అరెస్ట్‌ చేయడం చూశామా? ఒక 18 ఏళ్ల యువ‌కుడుకి సంబంధించిన రోడ్డు ప్రమాదాన్ని తీసుకుని హత్యానేరానికి సంబంధించిన సెక్షన్లు పెట్టారు. రోడ్డు ప్రమాదమైతే మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం వర్తించే సెక్షన్లు పెట్టాలి. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా నేరం చేసిన‌ట్టు కల్పబుల్‌ హోమిసైడ్‌ సెక్షన్లు పెట్టారు. కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత సెక్షన్లు మార్చారు. ఇప్పుడు ఏకంగా సీదిరి అప్ప‌ల‌రాజును కూడా అరెస్ట్‌ చేశారు. ఇదంతా చూస్తే మ‌నం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వ సామ్రాజ్యంలో ఉన్నామా? అర్థం కాని పరిస్థితి.’

- పోలీస్‌ స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారు

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వెనుకబడింది. కానీ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మాత్రం ముందుంది. పోలీసులు వీళ్ల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయారు. పోలీస్‌ స్టేషన్లను తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మార్చేశారు. పోలీసు వ్యవస్థను టీడీపీ అనుబంధ వ్యవస్థగా మార్చారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పోలీసులను రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుకు ఉపయోగిస్తున్నారు.

- బీసీ నాయకులే లక్ష్యంగా కక్ష సాధింపు

బీసీల తరఫున గొంతు వినిపిస్తున్నారనే కారణంతో అప్పలరాజును అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. మొదటి నుంచి బీసీ నాయకులను అణగదొక్కాలని ఈ ప్రభుత్వం చూస్తోంది. మా పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్‌పై అక్రమ కేసులు పెట్టారు. ఆయన ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై, ఆయన కుమారుడిపై కేసులు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై హత్యాయత్నం జరిగింది. నాగార్జున యాదవ్‌పై కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు. బీసీ నాయకులపై కక్ష సాధింపు చర్యలను ఒక పనిగా పెట్టుకున్నారు. ఒక బీసీ నాయకుడి గొంతు నొక్కితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు ఆగిపోతారని అనుకుంటున్నారు. ఒక్కరి గొంతు నొక్కితే లక్ష గొంతులు లేస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. బీసీలను బలహీనులుగా భావించి ఏం చేసినా పర్వాలేదని అనుకోవద్దు. బీసీలకు అండగా జగనన్న ఉన్నారు. బీసీలకు బ్యాక్‌బోన్‌గా జగనన్న ఉన్నారు. బలహీన వర్గాలన్నీ కలిసి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి.

- మత్స్యకారుల కోసం పోరాడినందుకే అప్పలరాజుపై కక్ష

విశాఖపట్నంలో ఆరుగురు మత్స్యకారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సముద్రంలో గల్లంతయ్యారు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మా అధినేత వైఎస్ జగన్ గారు కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తూతూమంత్రంగా సహాయం చేసి చేతులు దులుపుకుంటే, జగన్ గారు తన సొంత డబ్బులతో ఏడు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున అందించి అండగా నిలబడ్డారు. మత్స్యకారుల తరఫున అప్పలరాజు పోరాడారు కాబట్టే ఆయన గొంతు అణచివేయాలనే ధోరణితో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.

- బీసీలకు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అన్ని విధాలా మోసం చేసింది. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు. బీసీ మహిళలకు చేయూత లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. నేతన్న నేస్తం లేదు. చేదోడు, తోడు, లా నేస్తం లేవు. కళ్యాణమస్తు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఇస్తామని ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్‌ ఇస్తామని అమలు చేయలేదు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు.. అది కూడా లేదు. సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. బీసీలకు ఏడాదికి రూ.30 వేల కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయలేదు. ఆదరణ పథకం అమలు కావడం లేదు. బీసీల్లో ఉన్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించారు. ఇలా అన్ని రకాలుగా బీసీలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీసీ నాయకుల గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు.

- టీడీపీ నేతలకు ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయమా?

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ సభ్యుల వల్ల పొరపాటున ఇలాంటి యాక్సిడెంట్‌ జరిగితే వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్‌ చేస్తారా? ఇదే న్యాయం వారికి వర్తిస్తుందా? కందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోయారు. ఇదే న్యాయం వర్తిస్తే చంద్రబాబును కూడా అరెస్ట్‌ చేయాలి కదా? గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు చనిపోయారు. అప్పుడు కూడా ఇదే న్యాయం వర్తింపజేశారా? టీడీపీ నాయకులకు ఒక న్యాయం, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులకు మరో న్యాయమా?

- రెడ్‌బుక్‌ ప్రభుత్వానికే రెడ్‌ సిగ్నల్‌ అవుతుంది

సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం అత్యంత అన్యాయమైన చర్య. ఇలాంటి కక్షపూరిత చర్యలు కొనసాగిస్తే ప్రజలు తిరగబడతారు. మీరు ఏర్పాటు చేసిన రెడ్‌బుక్‌ మీకే రెడ్‌ సిగ్నల్‌ కాబోతోంది. అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా మా పార్టీలోని బీసీ నాయకులు వెనుకడుగు వేయరు. ఒక్కరిని ఇబ్బంది పెడితే లక్ష గొంతులు లేస్తాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి నాయకుడికీ వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం కక్షపూరిత ధోరణులను మానుకుని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలని వ‌రుదు క‌ళ్యాణి హిత‌వు ప‌లికారు.

Back to Top