అనంతపురం: ఎల్‌నినో ప్రభావం ఆగస్టు నాటికి తగ్గిపోతుందని అంతా భావించారని, కానీ ఇది సూపర్ ఎల్‌నినోగా ఏడాది అంతా కొనసాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఎల్‌నినో గురించి ప్రచారం చేయడం తప్ప, ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగు, సాగునీటితో పాటు పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. పంటల సాగు తగ్గడంతో పశుగ్రాసం కొరత గత ఖరీఫ్‌లోనే పంటల సాగు తగ్గిపోయిందని, దీంతో ప్రస్తుతం పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో గడ్డివాములు కనిపించని పరిస్థితి నెలకొందని, ఇప్పటికే పశుసంపదను మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారని తెలిపారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం రెండో స్థానంలో ఉందని, గతంలో వచ్చిన డొక్కల కరువు తరహా పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావంతో సాగు విస్తీర్ణం తగ్గింది ఈ ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 45 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. అనంతపురం జిల్లాలో 55 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 45 శాతం మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయని చెప్పారు. సాగు చేసిన పంటలు కూడా ప్రస్తుతం వాడుముఖం పట్టాయని, కొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్నాయని తెలిపారు. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు సామర్థ్యం మేరకు నీరు ఇవ్వాలి తుంగభద్ర నుంచి జిల్లాకు 27 టీఎంసీలు రావాల్సి ఉండగా ఈ ఏడాది 16 టీఎంసీలే వస్తాయని చెబుతున్నారని తెలిపారు. హంద్రీనీవా ద్వారా 4 టీఎంసీలు మాత్రమే వస్తాయని చెబుతున్నారని, మరోవైపు రూ.3,800 కోట్లు ఖర్చు చేసి సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచామని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో 2,800–3,000 క్యూసెక్కులకే నీరు వస్తోందని, 12 పంపులు పనిచేయని పరిస్థితిలో 3,850 క్యూసెక్కులు ఎలా తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల క్యూసెక్కులు ఉంటే కేవలం 7 వేల క్యూసెక్కులే విడుదల చేస్తున్నారని చెప్పారు. హంద్రీనీవా ద్వారా 3,850 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 40 వేల క్యూసెక్కుల సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలని స్పష్టం చేశారు. శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించాలి శ్రీశైలంలో ప్రస్తుతం 167 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా రాయలసీమకు తగినన్ని నీళ్లు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవుతోందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు ఆయువుపట్టుగా ఉందని, అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం రాయలసీమను గాలికి వదిలేస్తోందని అన్నారు. రాయలసీమ నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తే పరిస్థితి ఏంటి? గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా పోలవరం కుడి కాలువలోకి, అక్కడి నుంచి కృష్ణా డెల్టాకు తరలించి, తిరిగి కృష్ణా జలాలను రాయలసీమకు పంపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి 27 టీఎంసీలు తీసుకున్న పరిస్థితిలో, శ్రీశైలం నుంచి మళ్లీ కృష్ణా జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాయలసీమ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ నీటిని తరలించుకుపోతోందని తెలిపారు. రైతుల పంటలకు నీరు ఇవ్వాలి అనంతపురం జిల్లాలో సాగు కోసం నీటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారని, గస్తీలు పెడుతున్నారని చెప్పారు. కర్ణాటకలో ఆరుతడి పంటలకు నీరు అందిస్తుంటే ఇక్కడ హెచ్‌ఎల్‌సీ కింద పంటలు వేయొద్దని, హంద్రీనీవా నీటిని ఉపయోగించవద్దని చెబుతున్నారని తెలిపారు. సాగుకు అవసరమైన మేరకు నీటిని ఎలా వినియోగించాలో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఉద్యాన పంటలను కాపాడాలి రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు చెబుతున్నారని, ముందుగా పండ్ల తోటలను కాపాడాలని సూచించారు. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే చెట్లకు ట్యాంకర్లతో నీరు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. ఉద్యాన పంటలు ఎండిపోకుండా రక్షక తడులు అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులు సీఎంను కలవాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా స్పందించి ముఖ్యమంత్రిని కలవాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. రాయలసీమకు ఎక్కువ నీటిని విడుదల చేయాలని కోరాలని తెలిపారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేరని, ప్రజాప్రతినిధులు రాజకీయంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. హంద్రీనీవా నీటి వినియోగంపై లెక్క చెప్పాలి హంద్రీనీవా ద్వారా గత ఏడాది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 52 టీఎంసీలు తీసుకువచ్చామని, అందులో 25 టీఎంసీల వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే వినియోగించామని చెబుతున్నారని తెలిపారు. మార్చిలో హంద్రీనీవా నీటి విడుదల ఆగిపోయిందని, అయితే వచ్చిన నీళ్లన్నీ ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రూ.3,800 కోట్లతో సామర్థ్యం పెంచామని చెబుతున్న ప్రభుత్వం 12 పంపులు పనిచేయని పరిస్థితిపై సమాధానం చెప్పాలని కోరారు. రైతులు, పశువులను కాపాడేందుకు చర్యలు హెచ్‌ఎల్‌ఎంసీ, నార్త్ కెనాల్, సౌత్ కెనాల్, జీబీజీ కింద సుమారు 80 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యాయని తెలిపారు. కనీసం ఆ పంటలకు నీరు అందిస్తే రైతులకు, పశువులకు గ్రాసం విషయంలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. హంద్రీనీవా ద్వారా 25 టీఎంసీల నీటిని తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులంతా కలిసి సీఎంను కలవాలని సూచించారు. రైతులకు భరోసా కల్పించాలి ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, చాలా మంది రైతులు అన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ వర్షాభావంతో పంటలు వేయలేకపోయారని తెలిపారు. పంటలు వేయలేకపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇవ్వాలని కోరారు. జిల్లాలో మళ్లీ వలసలు కొనసాగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. రైతు కుటుంబాలకు పరిహారం అందించాలి గత రెండేళ్ల వ్యవధిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని కోరారు. పశుగ్రాసం కొరత రాకుండా ఇప్పటికే బోర్లు ఉన్న రైతులకు పరిహారం అందించి పశుగ్రాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమకు నీటి వాటా కోసం ప్రజాప్రతినిధులంతా ఒక్కతాటిపైకి రావాలని, శ్రీశైలం నుంచి మరింత నీటిని రాయలసీమకు తీసుకువచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.