అనంతపురం : మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును అక్రమ కేసులో అరెస్టు చేయడం బీసీల ఆత్మగౌరవంపై కూటమి ప్రభుత్వం చేసిన దాడి అని వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు. బీసీ నాయకులు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులతో రాజకీయంగా అణచివేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని మండిపడ్డారు. కారుమూరి అరెస్టుతో పాటు బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని తిప్పికొడతామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండిస్తూ రమేష్ గౌడ్ వీడియో విడుదల చేశారు. వీడియోలో రమేష్ గౌడ్ ఏమన్నారంటే.. - కారుమూరిని అక్రమ కేసులో ఇరికించడం దుర్మార్గం “కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీ నేత. బడుగులకు అండగా నిలిచిన శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించే వ్యక్తి. అలాంటి వ్యక్తిపై లేని కేసులను సృష్టించి, అక్రమ మద్యం రవాణా కేసులో ఇరికించే ప్రయత్నం చేసి అరెస్టు చేయడం దుర్మార్గం కాదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఎందుకు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు?” - బీసీ నేతలను ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తున్నారు “గత రెండున్నరేళ్లుగా బీసీ నేతలను ఒక్కొక్కరినీ ప్రణాళికాబద్ధంగా కేసులు, అరెస్టుల పేరుతో రాజకీయాలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, విడుదల రజిని, ఆమదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ వంటి ఎంతో మంది బీసీ నేతలను మీ రాజకీయ స్వార్థం కోసం బలిపశువులను చేస్తారా? మీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించకూడదా? మాట్లాడకూడదా? బీసీలు వ్యాపారం చేయకూడదా? గౌరవంగా జీవించకూడదా? రాజకీయాలు చేయకూడదా? ప్రతిపక్షంలో ఉన్నారనే కారణంతో బీసీ నేతలను ఇంత దుర్మార్గంగా టార్గెట్ చేయడం ఎక్కడి న్యాయం?” - బీసీలకు రెండు రకాల రాజ్యాంగాలు లేవు “మీకు నచ్చిన విధంగా బీసీ నేతలపై స్వైరవిహారం చేయడానికి రెండు రకాల రాజ్యాంగాలు ఏమైనా సృష్టించుకున్నారా? బీసీలను రాజకీయంగా అణచివేస్తూ, వారిని మీ చెప్పుచేతల్లో బానిసల్లా బతకాలని అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. బీసీలను అవమానించే, బీసీ నాయకత్వాన్ని అణచివేసే విధానాలను యావత్ బీసీ సమాజం గమనిస్తోంది. బీసీలను రక్షించడానికి, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు అండగా ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దు.” - బీసీ సమాజం గుణపాఠం చెప్పే రోజు వస్తుంది “బీసీ సమాజం పట్ల మీరు వ్యవహరిస్తున్న దుర్మార్గమైన తీరుకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. మీ విధానాల వల్ల అన్యాయానికి, అక్రమాలకు గురైన ప్రతి బీసీ నేతకు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాం. మీ బెదిరింపులకు, మీ కక్షసాధింపు చర్యలకు బీసీలు భయపడరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బీసీలపై కక్షసాధింపు విధానాన్ని విడనాడాలి.” బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కేసులు, అరెస్టుల రాజకీయాలకు వ్యతిరేకంగా బీసీ సమాజం ఐక్యంగా నిలవాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును, బీసీల రాజకీయ హక్కులను ఎవరూ అణచివేయలేరని స్పష్టం చేశారు.