కారుమూరి అరెస్టు బీసీలపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపునకు పరాకాష్ట

లేని కేసుతో బీసీ నాయకుడిని వేధిస్తూ.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్ర

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ తూర్పు గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు అక్ర‌మ‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం మద్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మద్యం షాపులు, బార్ల సంఖ్యను పెంచింది

ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి

మద్యం ధరలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు

ప్రజల దృష్టిని మళ్లించేందుకే కారుమూరి కుటుంబంపై కేసులు

ప్రశ్నించే బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోంది

కారుమూరి అరెస్టు బీసీలను అణచివేసే కుట్రలో భాగమే

ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేసిన చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

రాజమహేంద్రవరం : మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత కారుమూరి నాగేశ్వరరావును లేని కేసును సృష్టించి అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వం బీసీ నాయకత్వంపై సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కారుమూరిపై కుట్రపూరితంగా కేసు బనాయించారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కారుమూరిని ఈడీ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రాజమహేంద్రవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏమన్నారంటే..

- ప్రజలను దోపిడీ నుంచి కాపాడేందుకే జగన్‌ మద్యం నియంత్రణ

“ప్రజలు మద్యం విషయంలో దోపిడీకి గురికాకూడదని, మద్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినకూడదని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మద్యం పాలసీ తీసుకొచ్చారు. మద్యం షాపులు, బార్ల సంఖ్యను తగ్గించారు. అప్పటివరకు ఉన్న సుమారు 43 వేల బెల్ట్‌ షాపులను పూర్తిగా నియంత్రించి ఒక్క బెల్ట్‌ షాప్‌ కూడా లేకుండా చేశారు. మద్యం నిర్ణీత ధరలకు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మద్యం షాపుల సంఖ్యను పెంచారు, బార్లను పెంచారు, ధరలను భారీగా పెంచారు. సిండికేట్ల ద్వారా విక్రయాలు సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి.”

- మద్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటే నియంత్రణ ఏది?

“మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడపడం కారణమని చెప్పారు. మరి మద్యం సేవనం ఎందుకు పెరుగుతోంది? దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపులు ఉండటం, ప్రతి మద్యం బ్రాండ్‌పై నిర్ణీత ధర కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అధికంగా వసూలు చేయడం, మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? నియంత్రించాల్సిన ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.”

-  వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కారుమూరిపై కేసు

“తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కారుమూరి నాగేశ్వరరావు కుటుంబంపై లేని కుట్రపూరితమైన కేసును ఆపాదించి అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న బీసీ నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట. రైతుల సమస్యలపై, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై, బీసీలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించే నాయకులను ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోంది. కారుమూరి నాగేశ్వరరావు, అప్పలరాజు, విరూపాక్ష, సునీల్‌ వంటి నాయకుల విషయంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలి. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు.”

- కారుమూరి అరెస్టు బీసీలను అణచివేసే కుట్ర

“కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేయడం ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. బీసీల్లోని యాదవ వర్గాన్ని, ప్రశ్నించే బీసీ నాయకత్వాన్ని అణచివేసే ప్రయత్నం. అధికార పక్షంలో ఉన్న యాదవులకు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్న యాదవులకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బీసీల్లో ఎవరైనా తమ హక్కులు, తమ వాటా, తమ సమస్యలపై ప్రశ్నిస్తే నిరూపించలేని కేసులు బనాయించి వేధిస్తున్నారు. ఒక అబద్ధాన్ని సృష్టించి, లేని కేసును చూపించి కుటుంబాన్ని వేధించడం పాలన కాదు. ఇది నియంతృత్వ ధోరణికి పరాకాష్ట. బీసీ సోదరులు ఈ పరిణామాలను గమనించాలి. ప్రజలు అన్నింటినీ చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేసి ఎంతోకాలం పాలన సాగించలేరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన కక్షసాధింపు విధానాన్ని విడనాడాలి.”

కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు గమనించాలని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కోరారు. బీసీ నాయకత్వాన్ని అణచివేసే చర్యలకు స్వస్తి పలికి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని  చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ సూచించారు.

Back to Top