శ్రీకాకుళం: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ సీదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడనే ఆరోపణలపై పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని, డాక్టర్ సీదిరి అప్పలరాజు చేసిన నేరం ఏమిటని ప్రశ్నించిన ధర్మాన, ప్రతిపక్ష నాయకుడిగా ఉండటమేనా? గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడమేనా? లేక ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల్లో ఎత్తిచూపడమేనా? అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటి కేసుల్లో చట్ట ప్రకారం విచారణ జరిపి 41ఏ నోటీసులు జారీ చేసి కోర్టు పరిధిలో కేసు కొనసాగుతుందని చెప్పారు. కానీ ఈ కేసులో మాత్రం అసాధారణంగా వ్యవహరించి, ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై హత్యా నేరం నమోదు చేయడంతో పాటు, మాజీ మంత్రి అప్పలరాజును కూడా ముద్దాయిగా చేర్చి అరెస్ట్ చేయడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయ వేధింపులకు నిదర్శనమని, చట్టాన్ని రాజకీయ కక్ష తీర్చుకునే సాధనంగా ఉపయోగించడం సరికాదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేయడం కాకుండా చట్టం తన పని తాను చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించాలని, రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా అన్ని వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఒక మత్స్యకార నాయకుడికి అవకాశం కల్పించి, కేబినెట్‌లో స్థానం ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించే శాఖ బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో నాలుగు పోర్టుల అభివృద్ధికి ముఖ్యమంత్రి తర్వాత కీలక పాత్ర పోషించిన నాయకుడిని నేడు ఒక రోడ్డు ప్రమాదం కేసు పేరుతో అరెస్ట్ చేయడం, ఆయన కుమారుడిపై హత్యా కేసు నమోదు చేసి జైలుకు పంపించడం అత్యంత దురదృష్టకరమని, ఇదే తరహా ప్రమాద కేసుల్లో అధికార పార్టీ నాయకులు లేదా వారి కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఇదే విధమైన చర్యలు తీసుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారా, ప్రభుత్వాలు శాశ్వతం కావని, ప్రజల తీర్పుతోనే అధికారంలోకి వస్తాయని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తాయని, దీనిని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జిల్లాలో మత్స్యకార వర్గానికి ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర చాలా పరిమితంగా ఉందని, వారి హక్కుల కోసం పోరాడిన సందర్భాల్లో వేధింపులు ఎదురైన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలపై సమర్థంగా పోరాడే స్థాయికి ఎదిగిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమని, ఒక ప్రమాద ఘటనను ఆధారంగా చేసుకుని ఆయన కుమారుడి భవిష్యత్తును దెబ్బతీయడం ప్రజలు అంగీకరించే చర్య కాదన్నారు. గ్రామాల్లో ప్రజలను అడిగినా, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు పరిశీలించినా ఈ చర్యలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారనే విషయం స్పష్టమవుతుందని, ప్రమాద కేసును నమోదు చేసిన దర్యాప్తు అధికారిని వెంటనే వీఆర్‌కు పంపించి, అనంతరం మరో అధికారిని నియమించి అదనంగా రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్టబద్ధమైన దర్యాప్తు ప్రక్రియపై అనుమానాలు కలిగిస్తోందని, పోలీసు అధికారులు చట్టం, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? లేక రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. పలాస నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ అరెస్టు జరిగిన తీరు గురించి ప్రజలకు వివరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది అభిమానులు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంశాలను నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఈ విషయాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు లేదా ఆయన కుమారుడు కొంతకాలం జైలులో ఉండటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడదని, ఇటువంటి చర్యలకు భయపడి వెనక్కి తగ్గదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి కార్యకర్త ప్రజలకు ఒక విషయం స్పష్టంగా వివరించాలని కోరారు. సాధారణంగా రోడ్డు ప్రమాద కేసుల్లో పోలీసులు అనుసరించే చట్టపరమైన విధానం ఏమిటి? ప్రస్తుతం ఈ కేసులో అనుసరిస్తున్న విధానం ఏమిటి? అనే విషయాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి వాస్తవాలను తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే కాకుండా అధికార తెలుగుదేశం పార్టీకి కూడా తీవ్ర రాజకీయ నష్టం కలిగిస్తాయని అన్నారు. కేవలం అధికార బలంతో ప్రతిపక్ష నాయకులను వరుసగా అరెస్టు చేస్తే ప్రభుత్వం శాశ్వతంగా కొనసాగుతుందని భావించడం పొరపాటని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియలో సహజ న్యాయం సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, ఏ వ్యక్తినైనా నేరస్థుడిగా లేదా ముద్దాయిగా తేల్చే అధికారం కేవలం న్యాయస్థానానికే ఉంటుందని అన్నారు. దర్యాప్తు పూర్తికాకముందే ఒకవైపు వాదన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కొన్ని మీడియా కథనాల ఆధారంగా వ్యక్తులను ముందుగానే నేరస్థులుగా చిత్రీకరించడం, అనంతరం అదే దిశగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు కనిపించడం ఆందోళన కలిగించే అంశమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో న్యాయ ప్రక్రియ పూర్తికాకముందే ఎవరినైనా దోషిగా ప్రకటించే హక్కు ఎవరికీ లేదని, ఆ అధికారం కేవలం కోర్టులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారు, నేడు అదే పరిస్థితుల్లో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్టు, మత్స్యకార వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. మత్స్యకారులపై జరుగుతున్న అన్యాయాన్ని, రాజకీయ కక్షసాధింపు చర్యలను గ్రామ గ్రామాన చర్చించేలా పార్టీ కార్యకర్తలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తారని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, డాక్టర్ సీదిరి అప్పలరాజు మాత్రమే కాదు, రాజకీయ కక్షతో ఎవరిని అరెస్ట్ చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని, రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవహరించే పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ, శిక్షల భయంతో పనిచేసే పరిస్థితిని సృష్టించడం వల్ల పరిపాలనా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని విమర్శించారు. చట్టం, రాజ్యాంగం, న్యాయపరమైన విధివిధానాలకు అనుగుణంగా పాలన సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని పొందలేవని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతకు దారితీస్తాయని అన్నారు. ప్రజల మనోభావాలను విస్మరించి వ్యవహరించే ప్రభుత్వాలకు తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వర్తిస్తూ బాధితుల పక్షాన నిలబడుతుందని, కొందరు నాయకులను జైలుకు పంపించడం ద్వారా ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు. ఒకరిని నిర్బంధిస్తే మరెందరో ముందుకు వస్తారని, ప్రజాస్వామ్య పోరాటాలను అరెస్టులతో ఆపడం సాధ్యం కాదని అన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి, న్యాయపరమైన విధివిధానాలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారుల బాధ్యతను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు గతంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత ప్రతి ప్రభుత్వానిదేనని, అధికార యంత్రాంగం చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా పనిచేయాలని ఆయన కోరారు.