ఇసుక మాఫియా.. ఇద్దరు అమాయకుల ప్రాణాలు బలి

అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలి

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి డిమాండ్

రాజంపేట: అక్రమ ఇసుక రవాణా కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లికి చెందిన అబ్బన్నగారి జయరామ, రెడ్డిచర్ల రవీంద్ర జీవాల సంతకు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెంటనే గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో రాత్రింబవళ్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటన విషయం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెంటనే గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీవోతోనూ మాట్లాడి ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి కోరారు.
 

Back to Top