తిరుపతి: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే రాజకీయ కక్షతో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తాము 23 ఏళ్ల క్రితమే 24 ఎకరాల స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఎక్కడా ఇనామ్ భూములను ఆక్రమించలేదని స్పష్టం చేశారు. తమకు సంబంధించిన 9 ఎకరాల స్థలాన్ని రివర్ బెడ్‌గా పేర్కొంటున్నారని, దీనిపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందని అధికారులే చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తాము చట్టపరంగా కోర్టులో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మందబయలు ప్రాంతంలో దళితుడి పేరుతో ఉన్న స్థలాన్ని కూడా తమదిగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. వాస్తవాలతో సంబంధం లేకుండా తమ కుటుంబంపై ఆరోపణలు చేయడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనన్నారు. ‘‘నా ఆస్తులను లాక్కుంటారా? తీసుకోండి. వాటిని అడ్డుపెట్టుకుని మమ్మల్ని భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే మాపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్ని కక్షసాధింపు చర్యలకు దిగినా వెనక్కి తగ్గేది లేదు. న్యాయస్థానాల్లో చట్టపరంగా పోరాడుతాం’’ అని భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేశారు.