వైయస్సార్ జిల్లా: రాష్ట్రంలో పిల్లలకు, తల్లులకు చిరస్థాయిగా గుర్తుండిపోయే పథకం వైయస్ జగన్ తీసుకొచ్చిన అమ్మ ఒడి అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. నాటి అమ్మఒడినే నేడు తల్లికి వందనం పేరుతో అమలు చేస్తూ చంద్రబాబు వైయస్ జగన్‌ను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే తల్లికి వందనం ఎందుకు అమలు చేయలేదని రాష్ట్రంలోని తల్లులకు పెద్దకొడుకుగా ప్రశ్నిస్తున్నానన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలు ఉంటే 67 లక్షల మందికే తల్లికి వందనం ఇస్తున్నారని, మిగిలిన 20 లక్షల మంది పిల్లలకు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు రూ.13 వేలు మాత్రమే జమ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇచ్చే డబ్బులను కూడా సకాలంలో ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఇప్పుడు ఆ పనులు నిలిచిపోయాయని రాచమల్లు తెలిపారు. వైయస్ జగన్ హయాంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ట్యాబ్‌లు అందించగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిలిపివేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానాన్ని కూడా తొలగించారని పేర్కొన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించాలన్న వైయస్ జగన్ విధానానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైయస్ జగన్ ఓటమి తర్వాత ప్రభుత్వ విద్యారంగం కూడా తిరోగమనంలోకి వెళ్లిందని విమర్శించారు. విద్యారంగంపై ఇదే విధమైన నిర్లక్ష్యం కొనసాగితే రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి వందనం సహా విద్యారంగంలో వైయస్ జగన్ అమలు చేసిన విధానాలనే చంద్రబాబు అనుసరిస్తున్నారన్న విషయాన్ని టీడీపీ నాయకులు అంగీకరించాలని అన్నారు.