న్యూఢిల్లీ : గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు భంగం కలగకుండా జీవో నెం.3 స్థానంలో ప్రత్యామ్నాయ చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు అవసరమైన చట్ట సవరణలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు గురువారం కలిసి కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి మాట్లాడుతూ, జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని కోరారు. గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించేలా చట్టబద్ధ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు న్యాయం జరిగే విధంగా అవసరమైన చట్ట సవరణలు చేపట్టి, వారి హక్కులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు, లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, వై.ఎస్. అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తి పాల్గొన్నారు.