భారతి సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయించేందుకు బాబు, లోకేశ్ కుట్ర

ముడిసరకు రవాణా అడ్డుకునేలా చేయడం,  నోటీసులు జారీ సంస్థను బెదిరించడమే

: వైయ‌స్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజం

ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. బాధించడం.. మూసివేయిండం.. ఇదే కూటమి పాలసీ

కప్పం కట్టడం, కమీషన్లు చెల్లించడం, కాంట్రాక్ట్ లు అప్పగించే వారికే రెడ్ కార్పొట్

రెడ్ బుక్ లో  కంపెనీ పేరు లేకపోవడమే రాష్ట్రంలో సంస్థ స్థాపనకు ప్రాథమిక అర్హత

: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపాటు

శ్రీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తలుచుకుంటే  చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ను మూసివేయించలేరా

వేధింపులు.. దౌర్జన్యాలు ఇలాగే సాగితే రేపు మేం అధికారంలోకి రాగానే హెరిటేజ్ మూసివేత ఖాయం
: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరిక

ప్రొద్దుటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్షపూరిత రాజకీయాలో ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకోగా, ఇప్పుడు తాజాగా పారిశ్రామిక వేత్తలను లక్ష్యంగా చేసుకుని అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. పారిశ్రామిక వేత్తలను తొలుత బెదిరంచడం, ఆ తర్వాత బాధించడం.. చివరకు మూసివేయించే కుట్ర పూరిత విధానాలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులోని రాచమల్లు క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరైనా సరే పారిశ్రామికవేత్త పరిశ్రమను స్థాపించాలంటే మంత్రి లోకేశ్ అమలు చేస్తున్న రెడ్ బుక్ లో ఆ సంస్థ పేరు లేకపోవడమే ప్రాథమిక అర్హతగా మారిందని, ఆతర్వాతనే ఏ సంస్థ అయినా పరిశ్రమను స్థాపించే దశలో ముందడుగు వేయగలిగే పరిస్థితులను సృష్టించారని స్పష్టం చేసారు. దేశంలోని ఏ ప్రభుత్వమైనా సరే పరిశ్రమలకు పెద్దపీట వేసేందుకు రెడ్ కార్పెట్ వేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్ లకు కప్పం కట్టే  వాళ్లకు, కమిషన్లు చెల్లించే వారికి, కాంట్రాక్టులు ఇచ్చేవారికి మాత్రమే రెడ్ కార్పొట్ వేస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లా కమలాపురంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపులు, బెదిరింపులు, దౌర్జన్యాలే ఇందుకు నిదర్శనమని రాచమల్లు వివరించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం శ్రీ జగన్ కు కాస్తా వాటా ఉన్న కారణంగా భారతి సిమెంట్ పై కక్ష రాజకీయాలతో వెన్నుపోటు పార్టీ గుండాలు, కార్యకర్తలు కలసి అలజడి  సృష్టించి సున్నపరాయి ఆ ఫ్యాక్టరీకి చేరకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. లైమ్ స్టోన్ రావాణా సకాలంలో జరగకపోతే ఉత్పత్తి జరగక ఫ్యాక్టరీ మూతపడే  ప్రమాదం ఉందని, ఇదే కుట్రతో చంద్రబాబు, లోకేశ్ కలసి జగన్ పై రాజకీయ వేధింపులు సాగిస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ దుయ్యబట్టారు. ఈ ప్రెస్ మీట్ లో రాచమల్లు ఇంకా ఏం మాట్లాడరంటే...

భారతి సిమెంట్  మూసివేయించేందుకు కుట్ర

భారతి సిమెంట్ ఫ్యాక్టరిపై వెన్నుపోటు పార్టీ రౌడీ గ్యాంగ్  లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయి.  వెన్నుపోటు పార్టీ  నేతలు, కార్యకర్తలు దౌర్జన్యం కారణంగా కంపెనీకి ముడిసరుకు రవాణా చేస్తున్న లారీలను బరితెగించి అడ్డుకుంటున్నారు. ముడిసరకు కొరత కారణంగా  ఇప్పటికే రెండు రోజుల నుంచి  భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ముడిసరుకు నిలిపివేడం ద్వారా ఫ్యాక్టరీ  యాజమాన్యాన్ని కూటమి ప్రభుత్వం  బ్లాక్ మెయిల్ చేస్తోంది. అందులో భాగంగానే లైమ్ స్టోన్ లీజులు రద్దు చేస్తామంటూ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం వరుసగా నోటీసులు జారీ చేస్తూ వేధింపులకు దిగుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోంది. ఇలాంటి చర్యల ద్వారా భారతి సిమెంట్ ను పూర్తిగా మూసివేయించే కుట్రను రెడ్ బుక్ లో భాగంగా చంద్రబాబు, లోకేశ్ అమలు చేస్తున్నారు.   పరిశ్రమలపై ఇలా బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే చంద్రబాబు, లోకేశ్ కు కలిగే రాజకీయ ప్రయోజనం కన్నా, వాటా కలిగిన శ్రీ జగన్ కు ఎంత నష్టం వాటిల్లిన ఫర్వాలేదు కానీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా జీవనం సాగిస్తున్న సుమారు మూడు వేల మంది కార్మికులు ఆకలి కేకలు ఈ ఆరాచక ప్రభుత్వానికి గుర్తు రాలేదా..? పరోక్షంగా ఆధారపడ్డ 12 వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయన్న స్పృహ ప్రభుత్వానికి లేదా..?

ముడి సరుకు అడ్డుకుంటూ, లీజు రద్దుకు నోటీసులు 

భారతి సిమెంట్స్ సంస్థ ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 15 వేల కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తోంది.  ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.3,000 కోట్ల పన్నులు చెల్లించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ వైఎస్సార్ సీపీ అధినేత శ్రీ జగన్ పై ఉన్న రాజకీయ కక్షతో ఇప్పుడు లైమ్ స్టోన్ లీజులు రద్దుకు నోటీసులు జారీ చేసింది. ఇటు ప్లాంట్ కు ముడిసరుకు  రవాణా జరగకుండా అడ్డుకోవడం, అటు లీజులు రద్దు చేస్తామంటూ నోటీసులు జారీ చేయడం ద్వారా ఏకంగా భారతి సిమెంట్స్ పై కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర పన్నింది.   లారీలను అడ్డుకుంటున్న వెన్నుపోటు పార్టీ కార్యకర్తలపై  ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.   ఒక్క లారీని కూడా లోపలికి పంపే చర్యలు తీసుకోలేదు.  పరిశ్రమల భద్రతను కాపాడాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం పాటించడం దురదృష్టకరం.

 
కప్పం కట్టడం.. కమీషన్లు చెల్లించడం.. కాంట్రాక్ట్ లు అప్పగించడం.. ఇదే కూటమి పారిశ్రామిక పాలసీ

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమ స్థాపించాలంటే పెట్టుబడి, సాంకేతిక సామర్థ్యం సరిపోవడం లేదు.  అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టడం, కమిషన్లు ఇవ్వడం, కాంట్రాక్టులు అప్పగించడం వంటివి ఖచ్చితంగా పాటిస్తే రెడ్ కార్పొట్ వేస్తున్నారు.   అలాంటి ఒత్తిళ్లకు లొంగని వారిపై రాజకీయ కక్షతో చర్యలు తీసుకుని పరిశ్రమలను మూసివేసే పరిస్థితి సృష్టిస్తున్నారు.  ఆదాని పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు, దాల్మియా సంస్థ, అల్ట్రాటెక్ సిమెంట్, భవ్య చెట్టినాడు సిమెంట్, అరవిందో ఫార్మా, రామాయపట్నం పోర్టు, యుబీ బీర్ల కంపెనీ వంటి అనేక సంస్థలపై అధికార పార్టీ నేతలు రాజకీయ ఒత్తిళ్లు, కాంట్రాక్టుల కోసం బెదిరింపులు, వేధింపులు కొనసాగించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని  దందాల బిజినెస్ బరితెగించి సాగిస్తున్నారు. ఇప్పటివరకు  రాజకీయ  ప్రత్యర్థుల తర్వాత ఇప్పుడు పరిశ్రమలను కూడా లక్ష్యంగా చేసుకుందని, పారిశ్రామిక వేత్తలను బెదిరించి, కప్పం వసూలు చేసి, కమిషన్లు డిమాండ్ చేస్తూ పెట్టుబడులను పారద్రోలే ప్రమాదకర విధానాన్ని అనుసరిస్తోంది.    గత రెండేళ్లుగా రాష్ట్రంలో ముందుగా వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను వేధించడం, అనంతరం జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం, క్రెడిట్ చోరీ చేయడం వంటి చర్యలకు పాల్పడిన ప్రభుత్వం ఇప్పుడు పరిశ్రమలపై కూడా అదే కక్షసాధింపు రాజకీయాలను అమలు చేస్తుండటం బాధాకరం.

హెరిటేజ్‌పై మేమెప్పుడైనా ఇలా చేశామా?

2019 నుంచి 2024 వరకు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థపై ఎప్పుడైనా ఇటువంటి రాజకీయ వేధింపులు జరిగాయా..?    అధికారం ఉన్నప్పుడు హెరిటేజ్‌ను ఇబ్బంది పెట్టడం చాలా సులభమే. హెరిటేజ్ ను మూసివేయించడం శ్రీ జగన్ కు టీ తాగినంత సమయం పట్టదు.  అయినప్పటికీ  పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి అవసరమనే బాధ్యతతో అలాంటి చర్యలకు పాల్పడలేదు. కూటమి ప్రభుత్వం హెరిటేజ్ పై ఇదే తరహాలో  కక్ష సాధింపు, వేదింపులకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను ఖచ్చితంగా మూసివేయించడం ఖాయం. పరిశ్రమలను బెదిరించడం, కమిషన్లు డిమాండ్ చేయడం, ముడిసరుకును అడ్డుకోవడం, కక్షసాధింపు రాజకీయాలు కొనసాగించడం వల్ల రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావు. కూటమి పాలకుల నిర్వాకం కారణంగా ఉన్న పరిశ్రమలే ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన ఎమ్మెల్యేలు, మంత్రులకు   బరితెగించి చేస్తున్న వసూళ్ల పర్వం నుంచి  కట్టడి  చేయాలి.  పారిశ్రామిక వేత్తలకు భరోసా కల్పించాలి. లేకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.

Back to Top