కోడుమూరులో వైయ‌స్ఆర్‌సీపీ డీఎస్సీ రిలే దీక్షలు  

 డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి: డాక్టర్ ఆదిమూలపు సతీష్ 

కోడుమూరు : మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోడుమూరు నియోజకవర్గంలో డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఎంకే వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలను కోడుమూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.

విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం హామీలను అమలు చేసే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
 

Back to Top