విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, యువత మరియు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ధర్నాపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు దాడికి పాల్పడడం అత్యంత దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్న ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేసి, కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేయడం టీడీపీ గూండాయిజానికి నిదర్శనమని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనను అడ్డుకునే బదులు అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం అత్యంత బాధాకరమని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకుని కోడి గుడ్లతో దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన చర్య అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వైయస్ఆర్‌సీపీ రిలే దీక్షలకు సంబంధించి జిల్లా పోలీస్ కమిషనర్‌తో పాటు ఆయా ప్రాంతాల స్టేషన్ హౌస్ అధికారులకు ముందుగానే అనుమతుల కోసం దరఖాస్తులు సమర్పించినప్పటికీ, ఇలాంటి దాడులను అడ్డుకోకపోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు దాడులు, బెదిరింపుల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, ఆ హక్కును హరించే చర్యలను ప్రజలు సహించరని అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ ధర్నా చౌక్ వద్ద రోడ్డుపై కూర్చొని దేవినేని అవినాష్ సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, ఎం.డి. రూహుల్లా, మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతియుత నిరసనలకు పూర్తి భద్రత కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.