తాడేపల్లి: రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా అని, కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. రాష్ట్ర వాస్తవ ఆర్దిక పరిస్ధితిని దాచిపెట్టి చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు. గత వైయస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటూ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారన్న ఆయన, కాగ్, ఇతర ఆర్థిక సంస్థల లెక్కలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో అర్థం అవుతుందని చెప్పారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు చేసిన పచ్చి అబద్ధాలు, ఆరోపణలు, విమర్శలపై అంశాల వారీగా ఆధారాలతో సహా పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దువ్వూరి కృష్ణ వివరణ ఇచ్చారు. ప్రెస్‌మీట్‌లో దువ్వూరి కృష్ణ గణాంకాలతో సహా ఏమేం వివరించాడంటే..: చంద్రబాబు శ్వేతపత్రం తప్పుల తడక: సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తయ్యాయని, గత ప్రభుత్వ అప్పులు తమను వెంటాడుతున్నాయని, అందుకే తాము అనుకున్నవన్నీ చేయలేకపోతున్నామని చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంలో చెప్పుకొచ్చారు. 2014లో రాష్ట్ర విభజన కారణంగా వ్యవసా«యాధారిత ఆర్ధిక వ్యవస్ద తమకు వారసత్వంగా వచ్చిందని ఆయన అన్నారు. 2014–19లో అత్యధికంగా స్దూలఉత్పత్తి పెరిగిందని, ఆ తర్వాత వైయస్సార్‌సీపీ హయాంలో ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందని, తాను కొనసాగి ఉంటే అదే వృద్ధి రేటు కొనసాగేదని గొప్పలు చెప్పుకున్నారు. ఉద్యోగుల జీతాల వాటా పెరిగిపోవడం వల్ల రాష్ట్ర ఆదాయం సరిపోవడం లేదని, ఇంకా గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. హామీల విలువ రూ.2,39,628 కోట్లు. ఖర్చు చేసింది కేవలం రూ.31,483 కోట్లు: ప్రజలు తమ వాగ్దానాలు నమ్మరేమో అన్న భయంతో చంద్రబాబు, పవన్ ఇంటింటికీ వెళ్లి సంతకాలు చేసి మరీ వాగ్దానాల బాండ్లు ఇచ్చారు. అందులో ఒక్కో ఇంటికి ఐదేళ్లలో రూ.5.2 లక్షలు వస్తాయని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఒక్కొక్క హామీకి ఎంత మంది లబ్దిదారులు ఉండే అవకాశం ఉంది, వారికి ఆయా పథకాలు ఇస్తే ఎంత ఖర్చవుతుందో కూడా చెప్పేశారు. కానీ అధికారంలోకి వచ్చాక సూపర్ 7 పథకాలకు ఖర్చు పెట్టింది కేవలం రూ.31,483 కోట్లు మాత్రమే. అయితే వాస్తవంగా వాటి అమలు కోసం ఖర్చు చేయాల్సిన మొత్తం ఏకంగా రూ.2,39,628 కోట్లు. అంటే వాస్తవ వ్యయంలో కేవలం కేవలం 13 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు. తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారు. మ్యానిఫెస్టోలో మొత్తం 143 హామీలిచ్చారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు తీసుకుంటే వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకానికి ఆ ఐదేళ్లలో రూ.4800 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ వెన్నుపోటు పార్టీ కూటమి మ్యానిఫెస్టోలో డ్వాక్రా సంఘాల రుణ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి, అదీ చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల కోసం 2024–25లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 2025–26లో రూ.100 కోట్లు ఖర్చు పెడతామని బడ్జెట్‌లో చెప్పారు. కానీ, ఇచ్చింది శూన్యం. ఇంకా పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలకు గత ప్రభుత్వ హయాంలో 2023–24లో రూ.300 కోట్లు ఖర్చు చేయగా, అదే మొత్తం ఖర్చు చేస్తామని వెన్నుపోటు పార్టీ కూటమి 2024–25లో చూపింది. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక 2025–26 బడ్జెట్లో అసలు దీని ఊసే లేదు. దీని పర్యవసానంగా స్వయం సహాయక సంఘాల పరపతి వృద్ధి లేకుండా పోయింది. అలాగే డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా వైఎస్సార్సీపీ హయాంలో పోలిస్తే భారీగా తగ్గిపోయాయి. 2023–24లో వాటి పరపతి రూ.49,626 కోట్లు కాగా, 2024–25లో అది రూ.41,623 కోట్లకు, 2025–26లో రూ.41,105 కోట్లకు తగ్గిపోయింది. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, కొనసాగుతున్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారనడానికి ఇదే మంచి ఉదాహరణ. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికే కాకిలెక్కలు: అప్పుల విషయంలోనూ వైఎస్సార్సీపీ హయాంలో వీళ్లు ఎన్నో అపోహలు సృష్టించారు. అందుకోసం అదే పనిగా విష ప్రచారం చేశారు. 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని వెన్నుపోటు పార్టీ కూటమి మ్యానిఫెస్టోలోనే చెప్పారు. కానీ అదే వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక, తమ తొలి బడ్జెట్‌లో.. 2023–24 చివరకు రాష్ట్ర అప్పును రూ.4,91,734 కోట్లుగా చూపారు. ప్రభుత్వ గ్యారెంటీ అప్పు మరో రూ.1,54, 797 కోట్లు. రెండూ కలిపినా మొత్తం అప్పు దాదాపు రూ.6.5 లక్షల కోట్లు మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికే వారి లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.3,13,018 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.6,46,531 కోట్లకు చేరింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,31,671 కోట్లు మాత్రమే. మరి వారు విష ప్రచారం చేసినట్లు ఎక్కడ రూ.14 లక్షల కోట్లు? ఎక్కడ రూ.3.31 లక్షల కోట్లు?! నిజానికి నాడు రెండేళ్లు కోవిడ్ మహమ్మారి ఉన్నా, 13 శాతం మాత్రమే అప్పు పెరిగింది. కానీ ఇప్పుడు ఎలాంటి సంక్షోభాలు లేకపోయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ హయాంలో ఏకంగా 22 శాతం అప్పు పెరిగింది. అందుకే తాము చెప్పిన అబద్దం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అని ప్రజలను మభ్య పెట్టారు. పౌరసరఫరాల సంస్థ, ఇంధన రంగాల్లో ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పు అందులోనే ఉన్నా వేరుగా చూపిస్తున్నారు. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కు విభజన సమయంలో సబ్సిడీతో నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో ఈ అప్పు తీసుకున్నారు. కాబట్టి దీన్ని విడిగా చూపిస్తే రెండుసార్లు లెక్కించినట్లవుతుంది. బడ్జెట్ పుస్తకాల్లో కానీ, ఇతర ప్రభుత్వ లెక్కలు చూసినా చంద్రబాబు చెప్పిన అప్పులకు ఎలాంటి ఆధారాలు లేవు. రెండేళ్లలో ఏకంగా రూ.3,53,714 కోట్ల అప్పు: ఇప్పుడు ఎలాంటి సంక్షోభాలు, కోవిడ్ తరహా ఇబ్బందులు లేకపోయినా ఈ రెండేళ్లలో రూ.3,53,714 కోట్ల అప్పు చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో ప్రభుత్వం తీసుకున్న అప్పులతో పాటు, గ్యారంటీలు కూడా ఉన్నాయి. అంటే ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు ఐదేళ్లలో మేం చేసిన అప్పు కంటే ఎక్కువగా ఉంది. నీతి ఆయోగ్ కూడా ఏపీలో అప్పుల స్దిరత్వం లేదని చెప్పింది. స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు కంటే వడ్డీ భారం వేగంగా పెరుగుతుంటేనే ఇలా జరుగుతుంది. 2013–14లో ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన వడ్డీ కేవలం రూ.12,910 కోట్లు. విభజన చట్టంలో మన రాష్ట్రానికి వారసత్వంగా వచ్చిన వడ్డీ భారం రూ.7500 కోట్లు. 2014–19లో అది రూ.15,342 కోట్లు. ఈ ఐదేళ్లలో వార్షిక వడ్డీ చెల్లింపుల రేటు 15.43 శాతంగా ఉంది. జీఎస్డీపీ పెరిగిన శాతం చూస్తే 13.48 శాతం మాత్రమే. దీన్ని బట్టి చూస్తే అప్పుడే అప్పుల స్థిరత్వం లేదని అర్దమవుతోంది. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రుణ అస్థిరత ఉందని అబద్దాలు చెప్పారు. రాష్ట్ర ఆదాయాలపైనా తప్పుడు లెక్కలే: కోవిడ్ వల్ల అప్పులు పెరగడం, స్ధూల ఉత్పత్తి తగ్గడం జరిగాయి. ఇది ప్రతీ రాష్ట్రంలో, దేశంలో జరిగిందే. ఇప్పుడు ఏ విపత్తూ లేకపోయినా అప్పు, జీఎస్టీడీపీ నిష్పత్తి తొలి ఏడాది 35.73 శాతానికి, రెండో ఏడాది 36.66 శాతానికి పెరిగింది. వైఎస్సార్సీపీ హాయంలో కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోవడంతో కేంద్రం ఎక్కువ అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. జీఎస్టీడీపీ లో అప్పులు 3 శాతం మాత్రమే ఉండగా.. దాన్ని 5 శాతం వరకూ కేంద్రం అనుమతించింది. రాజ్యాంగంలో ఆర్టికల్:293 ప్రకారం ఓ రాష్ట్రం ఎంత అప్పులు చేయొచ్చనేది కేంద్రం నిర్దేశించింది. దాని ప్రకారమే మేం అప్పులు చేశాం. టీడీపీ ప్రభుత్వం మాత్రం కేంద్రం అనుమతించిన దాని కంటే ఎక్కువగా అప్పులు చేశారు. దానికి జరిమానాగా మా హయాంలో అప్పులు తీసుకునే పరిమితిని తగ్గించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్ధితి నెలకొంది. సంపద సృష్టిలో తనకు అత్యంత ప్రావీణ్యం ఉందని చెప్పి, ఆదాయాలు పెరిగిపోతాయని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. రాష్ట్రం సొంత పన్ను ఆదాయాలు గతేడాది కేవలం 4 శాతం వృద్ధిలో ఉన్నాయి. పన్నేతర ఆదాయాలు మాత్రం మైనస్‌లోకి వెళ్లిపోయాయి. ఓ సంవత్సరం ఆదాయం తగ్గితే, మరో సంవత్సరం పెంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ కాగ్ లెక్కల ప్రకారం చూసినా పన్నుల ఆదాయం ఏటా తగ్గుతోంది. ఈ ఏడాది మైనస్ ఏకంగా 2.22 శాతానికి ఆదాయ వృద్ధి పడిపోయింది. పన్నేతర ఆదాయంలోనూ అప్పులే: మరోవైపు పన్నేతర ఆదాయం పెరిగినట్లు కనిపిస్తున్నా, ఇందులో అప్పు కూడా ఉంది. వైఎస్సార్సీపీ ఆఖరి సంవత్సరంతో పోలిస్తే ఈ రెండేళ్ళలో చూస్తే ఆదాయాల వృద్ధి పూర్తిగా పడిపోయింది. 2023–24లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు రూ.85,922 కోట్లు ఉంటే, 2025–26 నాటికి ఆదాయం రూ.86,552 కోట్లకు మాత్రమే పెరిగింది. పన్ను, పన్నేతర ఆదాయాలు కలిపినా రెండేళ్లలో సగటు వృద్ధి రేటు కేవలం 0.15 శాతం. వైఎస్సార్సీపీ హయాంలో 21 శాతం వ్యయం కోసం అప్పుల మీద ఆధారపడితే కూటమి ప్రభుత్వంలో మాత్రం మొదటి సంవత్సరంలో 31.54 శాతం వ్యయం కోసం, రెండో సంవత్సరంలో 31.40 శాతం వ్యయం కోసం అప్పుల మీద ఆధార పడ్డారు. మేం తీసుకున్న అప్పులో 33.24 శాతం మూలధన వ్యయం కోసం ఖర్చు పెడితే, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎలాంటి సంక్షోభాలు లేకపోయినా, కేంద్రం నుంచి సాయం అందుతున్నా చేసింది కేవలం 26 శాతమే. వైఎస్సార్సీపీ హయాంలో జరిగింది ఇదీ: వైఎస్సార్సీపీ ప్రభుత్వమే దురుద్దేశంతో 15వ ఆర్ధిక సంఘం నిధుల్ని వాడేసుకుందని చంద్రబాబు అబద్దాలు చెప్పారు. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే అలా వాడుకునే అవకాశం ఉండదని ముఖ్యమంత్రిగా పని చేస్తున్న ఆయనకు తెలియంది కాదు. ఆర్దిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నిధుల్ని విడుదల చేస్తుంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇష్టారాజ్యంగా లాగేసుకోవు. వ్యవసాయాధారిత రాష్ట్రం వారసత్వంగా వచ్చింది కాబట్టి పన్నులు తక్కువగా వస్తున్నాయని చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ వాస్తవానికి 2013–14లో వ్యవసాయం నుంచి కేవలం 30 శాతమే రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. 2014–19లో తయారీ, సేవా రంగాలు తగ్గి, వ్యవసాయ రంగం ఆదాయం మాత్రం 35 శాతానికి పెరిగింది. అంటే చంద్రబాబు చెప్పింది అబద్దమని తేలిపోయింది. 2014–19లో వృద్ధి రేటు 13.5 శాతం వచ్చిందని, ఆ తర్వాత తమ ప్రభుత్వం కొనసాగకపోవడం వల్ల తగ్గిపోయిందని చంద్రబాబు పచ్చిగా మరో అబద్దం చెప్పారు. కానీ కోవిడ్ విపత్తు వచ్చిందన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది అర్దమవుతుంది. అలాగే 2013–14లో తలసరి ఆదాయం రూ.82,870 ఉండేది. దేశంలో 17వ ర్యాంకులో ఉన్నాం. 2018–19లో అది కాస్తా రూ.1.54 లక్షలకు పెరిగింది. అయినా ర్యాంకు మాత్రం 17గానే ఉంది. తెలంగాణ మాత్రం ఇదే కాలంలో 13వ ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్‌కు చేరింది. ఇది విధ్వంసాన్ని సూచిస్తోందా? లేక పురోగతిని సూచిస్తోందా? ప్రజలే చెప్పాలి. కూటమి పాలనలో జరుగుతోంది అసలు విధ్వంసం: కూటమి రెండేళ్ల పాలనలో జీఎస్టీ వృద్ది రేటు పెరిగిపోతోందని చెప్పుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో జీఎస్టీపీ 9–10 శాతం పెరిగితే, ఆదాయాలు కూడా 10 శాతం పెరిగాయి. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు 6 శాతం పెరిగాయి. అదే సమయంలో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు మైనస్ 3.22 వస్తుంటే, స్థూల ఉత్పత్తి చూస్తే మాత్రం 10.75 శాతం వస్తోందని ప్రభుత్వం పచ్చి అబద్ధం చెబుతోంది. అదే సమయంలో దేశ జీడీపీలో 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండింటి మద్య ఎంతో తేడా కనిపిస్తోంది. మరి ఇది ఏ రకంగా సాధ్యమో చెప్పాలి. ఈ రకమైన లెక్కలతో మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎలా నమ్ముతారు? ఇదంతా అంకెల గారడీ మాత్రమే. మెరుగైన పాలన అందించి, జీఎస్టీపీ పెంచుకుంటే అందరూ అభినందిస్తారు. కానీ వాస్తవాల్ని పక్కన బెట్టి మనల్ని మనం మోసం చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అదే నిజమైతే ఇదెలా సాధ్యం?: గత ఐదేళ్లలో విధ్వంసం జరిగిపోయిందని, బ్రాండ్ ఏపీ పడిపోయిందని, పెట్టుబడిదారులు పారిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ ఐదేళ్లలో జీవీఏ వృద్దిలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో అగ్రస్థానంలో ఉంది. తయారీ రంగంలో దక్షిణాదిలో అగ్రస్థానంలో ఉంది. పరిశ్రమల రంగంలో జీవీఏ చూసినా దక్షిణాదిలో అగ్రస్థానంలో, దేశంలో ఎనిమిదో స్ధానంలో ఉంది. విధ్వంసం జరిగి ఉంటే ఇదంతా ఎలా సాధ్యమో చెప్పండి. ‘పీపీపీ’ లోనూ అన్నీ అబద్ధాలే: ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పచ్చి అబద్దాలు చెబుతూ వీరు రాష్ట్ర ప్రతిష్టను విధ్వంసం పేరుతో దిగజారుస్తున్నారు. పీపీపీని చంద్రబాబు సొంతంగా కనిపెట్టినట్లు మాట్లాడారు. కేంద్ర ఆర్దిక శాఖ గణాంకాల ప్రకారం ఏపీకి రూ.1.78 లక్షల కోట్లు పీపీపీ విధానంలో వచ్చాయన్నారు. ఇందులో 41 శాతం పెట్టుబడులు ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. 30 శాతం ప్రీ డీపీఆర్ స్ధాయిలో ఉన్నాయి. కేటాయించినవి ఐదు ప్రాజెక్టులు మాత్రమే. మరో రూ.14 వేల కోట్లు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు, రాయాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు మాత్రమే. ఇది ఏ రకంగా మీ ఘనతో చెప్పాలి. కేటాయించిన ప్రాజెక్టులు కూడా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లే. సాధారణంగా విద్యుత్ యూనిట్ రూ.4.46కు దొరుకుతుంటే దాన్ని పక్కన బెట్టి, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ లలో యూనిట్ రూ.8 చొప్పున కొనేందుకు సిద్దమయ్యారు. అందుకే ఆ ప్లాంట్లు వస్తున్నాయి. కానీ ఈ విశ్లేషణలు మాత్రం ఎక్కడా కనిపించవు. అలాగే పీపీపీ విధానంలోనే చేపట్టిన రామాయపట్నం, గంగవరం పోర్టుల్ని పోలిస్తే.. రెండింటిలోనూ ప్రభుత్వం భూమి కేటాయించింది. గంగవరంలో భూకేటాయింపు తప్ప ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడీ పెట్టలేదు. కానీ రాయాయపట్నంలో రూ.4,929 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటుపరం చేస్తే ప్రభుత్వానికి వచ్చేది రూ.1500 కోట్లే. మిగతా రూ.3,500 కోట్లు ఎలా వస్తాయో చెప్పాలి. మీరు మాట్లాడితే ఆదాయం వస్తుంది అంటున్నారు. కేవలం పీపీపీ విధానంలోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అంటే సరికాదు. ఆస్పత్రుల్ని పీపీపీ విధానంలో చేపట్టడం తప్పని అందరూ చెప్పారు. హామీలు ఎగ్గొట్టేందుకే ఉద్యోగుల జీతాలపై అసత్యాలు: ఉద్యోగుల జీతాల వ్యయం ఎక్కువైపోతుందని, ఇక పాలన ఎలా చేయాలని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. 2014–15లలో 66 శాతం ఉన్నది కాస్తా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 123 శాతానికి వెళ్లిందని చంద్రబాబు అబద్దాలు చెప్పారు. 2014–15లో 66 శాతం ఉన్నది కాస్తా టీడీపీ హయాంలోనే ఇది 2017–18లో 98 శాతానికి వెళ్లింది వాస్తవం కాదా? కోవిడ్ వల్ల ఆదాయాలు పడిపోయినా, ఉద్యోగుల జీతాలు తగ్గించుకునే పరిస్ధితి లేదు కాబట్టి మా హయాంలో ఈ ఖర్చు కనిపించింది. వైఎస్సార్సీపీ హాయాంలోనే ఉద్యోగుల జీతాల వ్యయం 99 శాతానికి తగ్గింది. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చంద్రబాబే చెబుతారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం నిరర్ధక ఆస్తిగా అభివర్ణించారు. కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి వచ్చిన సొంత ఆదాయాలు 2024–25లో రూ.95,407 కోట్లు. అలాగే చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఉద్యోగుల జీతాల వ్యయం రూ.1,02,233 కోట్లు. అంటే 107 శాతం వస్తోంది. కానీ 98 శాతానికి తగ్గించామని అబద్దాలు చెప్తున్నారు. 2025–26లో 96 శాతానికి వచ్చిందని చెప్పారు. కానీ వాస్తవానికి ఇది 103 శాతంగా ఉంది. దీని ద్వారా ఉద్యోగాలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలి. ఉద్యోగులకు ఇంత భారీగా జీతాలు ఇచ్చేస్తున్నామని చెప్పడం ద్వారా వారిపై ప్రజల్లో వ్యతిరేకత కలిగించాలనే ఉద్దేశమే కనిపిస్తోంది. మా హయాంలో ఐఆర్ తో పాటు పీఆర్సీ, డీఏలు కూడా ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వంలో ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తప్పించుకునేందుకే ఈ లెక్కలు చెప్పినట్లు అర్దమవుతోంది. ఆస్తుల తాకట్టులో చంద్రబాబు చెత్త రికార్డు: అలాగే గతంలో విపక్షంలో ఉండగా, వెన్నుపోటు పార్టీ కూటమి నాయకులు ఆస్తుల్ని ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తుందని ఆరోపించేవారు. ఇప్పుడు శ్వేతపత్రంలో రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. కానీ ఇప్పుడు ఇదే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రుణం కోసం ఏకంగా రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెడుతున్నారు. దీన్ని బట్టి ఆస్తుల తాకట్టులో ఎంత వ్యత్యాసం ఉందో అర్దం చేసుకోవచ్చు. వడ్డీ రేట్లపైనా అబద్ధాలు ప్రచారం: ఇంకా అధిక వడ్డీ రేట్లకు అప్పులు తెచ్చామని మాపై ఆరోపణలు చేశారు. కానీ రాష్ట్రాల వారీగా వడ్డీ రేట్లలో ఎప్పుడూ పెద్దగా వ్యత్యాసం ఉండదు. గతంలో 2018లో టీడీపీ ప్రభుత్వం ఆర్బీఐ బాండ్ల రేటు 8.42 శాతం ఉంటే.. బయట 10.32 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు. ఆర్బీఐ బాండ్ల కంటే ఎక్కువ శాతానికి అప్పులు తెచ్చారు. ఇక ఇప్పుడు ఏపీఎండీసీలో ఆర్టికల్:291 ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఖజానా నుంచి నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం బాండ్ దారులకు ఇచ్చారు. ఇంకా ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేటు కంటే ఎక్కువకు రుణాలు తెస్తున్నారు. వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కళ్లార్పకుండా పచ్చి అబద్దాలు చెబుతూ, గంటలకొద్దీ ప్రజెంటేషన్ ఇస్తూ, చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అసత్యాలు, గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, శ్వేతపత్రం పేరుతో డ్రామా చేశారని దువ్వూరి కృష్ణ వివరించారు.