కర్నూలు: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్రంలో రక్షణ కరువైందన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై నమోదైన కేసులను ఖండిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2వ తేదీన ఆలూరు ఎమ్మెల్యేపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని, అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులపైనే మూడు అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ చర్యలను వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రంలో "రెడ్ బుక్ రాజ్యాంగం" అమలవుతోందని, ప్రజాప్రతినిధులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపుతోనే అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎలాంటి నేర చరిత్ర లేదని, ఆయనపై మచ్చలేని ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి కూటమి నాయకులు రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యం వంటి ఘటనలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని, ఆదోనిలో దళిత సర్పంచ్ అవమానానికి సంబంధించిన ఘటనపైనా అధికార పార్టీ దళిత ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. వాల్మీకి, దళిత వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులపై అన్యాయం జరిగినప్పుడు అధికార పార్టీ నాయకులు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో కూడా కేసుల రాజీ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ నాయకులపై నమోదవుతున్న అక్రమ కేసులపై పార్టీ చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తుందని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులు తమ చర్యలకు భవిష్యత్తులో జవాబుదారీ కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.