ఆత్మకూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొని యువత, విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజం ప్రభుత్వ వైపే ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయం? డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే స్వతంత్ర దర్యాప్తుకు సహకరించాలని, సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన ప్రభుత్వం రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్‌బాబు, మండల నాయకులు రామ్మోహన్‌రెడ్డి, సయ్యద్‌మీర్, తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.