డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేపు, ఎల్లుండి (07.08.2026, 08.08.2026) అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది. అలాగే ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. ఈ నెల 10న నిర్వహించే ర్యాలీలు ముగిసిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.