ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

వైయ‌స్సార్‌సీపీ 

డీఎస్సీ ఉద్యమాలపై దాడులు, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై డీజీపీకి వినతిపత్రం అందజేసేందుకు వెళ్లిన వైయ‌స్సార్‌సీపీ మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రహమతుల్లా, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితర నేతలు డీజీపీ అందుబాటులో లేకపోవడంతో డీఐజీ ఫక్కీరప్పకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ నిరసనలపై దాడులు, శిబిరాల తొలగింపుపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు

మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత, రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితులపై డీఐజీ ఫక్కీరప్ప దృష్టికి కీలక అంశాలు

డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ, లోకేశ్ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి 
అమలు డిమాండ్

విజయవాడతో పాటు పలు జిల్లాల్లో శాంతియుత నిరసనలకు ఆటంకాలు, టెంట్ల తొలగింపు, దాడుల వివరాలతో వినతిపత్రం

దాడులపై క్రిమినల్ కేసులు, పోలీసు అధికారుల పాత్రపై విచారణ, నిరసన శిబిరాలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి

రాజ్యాంగబద్ధంగా పోలీసింగ్ నిర్వహించి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని వైయ‌స్సార్‌సీపీ విజ్ఞప్తి 

మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ–2025 అక్రమాలపై వైయ‌స్సార్‌సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై చోటుచేసుకున్న దాడులు, శిబిరాల తొలగింపు, శాంతియుత నిరసనలకు ఆటంకాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రత తదితర అంశాలపై డీజీపీకి వైయ‌స్సార్‌సీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ డీఐజీ ఫక్కీరప్పకు వినతిపత్రాన్ని అందజేసి, రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. వినతిపత్రంలో విజయవాడతో పాటు పల్నాడు, కనిగిరి, యాడికి, తాడిపత్రి, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు తదితర ప్రాంతాల్లో శాంతియుత నిరసనలకు ఆటంకాలు ఎదురయ్యాయని, దాడులు, టెంట్ల తొలగింపు, నిరసనకారుల అరెస్టులు వంటి అంశాలను ప్రస్తావించింది. అలాగే విజయవాడ ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, పోలీసు అధికారుల పాత్రపై విచారణ, శాంతియుత దీక్షలకు తగిన భద్రత కల్పించడం వంటి ఎనిమిది ప్రధాన విజ్ఞప్తులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. అనంత‌రం డీజీపీ కార్యాల‌యం వ‌ద్ద వైయ‌స్సార్‌సీపీ నేత‌లు మీడియాతో మాట్లాడారు. 
వైయ‌స్సార్‌సీపీ నేత‌లు ఏమ‌న్నారంటే..

-  మాజీ సీఎం భద్రతపై ప్రభుత్వం బాధ్యత వహించాలి: తానేటి వనిత
మాజీ ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరీ భద్రత కలిగిన ప్రతిపక్ష నాయకుడు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి పూర్తి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులతో పాటు ఈ అంశాలన్నింటినీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చాం. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ డీఐజీ ఫక్కీరప్పకు వినతిపత్రం అందజేశాం. మేము ప్రస్తావించిన ప్రతి అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని డీఐజీ హామీ ఇచ్చారు. 

- డీఎస్సీ ఉద్యమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ
డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా, విద్యాదీవెన–వసతిదీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. కానీ పలు చోట్ల దీక్షా శిబిరాలు తొలగించడం, టెంట్లు కూల్చివేయడం, కార్యకర్తలపై దాడులు జరగడం, విజయవాడ, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో శాంతియుత నిరసనలకు ఆటంకాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం కాదు. ఈ ఘటనలన్నింటినీ డీఐజీ దృష్టికి తీసుకెళ్లాం. దాడులకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, ఘటనలపై స్వతంత్ర విచారణ, విధి నిర్వహణలో వ్యవహరించిన పోలీసు అధికారులపై విభాగీయ విచారణ చేపట్టాలని వినతిపత్రంలో కోరాం. 

- నిష్పక్షపాత పోలీసింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి
శాంతియుత నిరసనలను అడ్డుకోవడం, ఇచ్చిన అనుమతులను మౌఖికంగా ఉపసంహరించుకోవడం, ఒక వర్గానికి రక్షణ కల్పిస్తూ మరో వర్గం నిరసనలను అడ్డుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పోలీసు వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతి శాంతియుత నిరసనకు రక్షణ కల్పించాలి. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, జర్నలిస్టులు పాల్గొనే దీక్షలకు ప్రత్యేక భద్రత కల్పించడంతో పాటు జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని డీజీపీకి సమర్పించిన వినతిపత్రంలో కోరాం. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధమైన, శాంతియుత పోరాటాన్ని వైయ‌స్సార్‌సీపీ కొనసాగిస్తుందని చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌ స్పష్టం చేశారు.

Back to Top