తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో చివరకు దేవుళ్లకూ రక్షణ లేకుండా పోయిందని, అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల క్షేత్ర పాలకుడిగా భక్తులు ఆరాధించే ఆంజనేయస్వామి వారి విగ్రహం మాయం కావడమే ఇందుకు నిదర్శనమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆక్షేపించారు. టీటీడీలో భద్రతా, పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆమె అన్నారు. తిరుమలలో వరసగా పాలనా పరమైన, భద్రతా పరమైన, ధర్మ పరిరక్షణ పరంగా అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయని, వాటన్నింటికీ టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యత వహించి, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంజనేయస్వామి అంటే గౌరవమంటూ.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఇప్పుడు ఏమయ్యారని శ్యామల ప్రశ్నించారు. ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కావడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని, దీంతో టీటీడీలో భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా, సనాతనవాది అని గొప్పగా ప్రచారం చేసుకున్న వ్యక్తి ఏమయ్యాడని ప్రశ్నించారు. ఆయన ఏ గుడి మెట్లు కడుగుతున్నాడని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్యామల ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లో ఆరె శ్యామల ఇంకా ఏం మాట్లాడారంటే..: తిరుమల పవిత్రతకు తీవ్ర భంగం: తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వెళ్తూ, మార్గమధ్యంలో శ్రీఆంజనేయస్వామివారిని దర్శించుకుని దైర్యంతో భక్తులు ముందుకు సాగుతుంటారు. 60 ఏళ్ల చిరిత్ర గల తిరుమల క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి వారి విగ్రహం మాయం కావడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఎన్నో అరాచకాలు, క్షేత్రం అపవిత్రంగా భావించే వింతలు, అన్యాయాలు తిరుమల కొండపై చోటు చేసుకుంటున్నాయి. స్వామివారి గోశాలలో ఆవులు మృతి చెందాయి. ఇంకా కొండపై మద్యం, మాంసం, గంజాయి బ్యాచ్‌లు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, తాను సనాతన హిందూవాదినని ప్రకటించుకున్న నాయకుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతున్నాడు?. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలపైనా ఆయన ఎందుకు స్పందించడం లేదు?. కూటమి పాలనలో హిందూ ధర్మ విరుద్ధ వ్యవహారాలు: గుళ్లను కూల్చివేయడం, విగ్రహాలు మాయమవడం వంటివి టీడీపీ కూటమి పాలనలోనే సాగుతోంది. లడ్డూలో కల్తీ అంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టిన నాటి నుంచి వరుసగా దేవస్థానంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మంను పేరుకు పరిమితం చేసి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కనీసం భక్తులకు దర్శనం కల్పించే విషయంలోనైనా టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు శ్రద్ధ చూపుతున్నారా? అంటే అదీ లేదు. ఇంకా తిరుమలలో అపచార ఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తోందని ఆరె శ్యామల చెప్పారు.