తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుత్తా శివశంకర్ మీడియాతో మాట్లాడారు. ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకుంటూ, మాజీ మంత్రి, బీసీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యల పరిష్కారంలోనూ, శాంతి భద్రతల నిర్వహణలోనూ విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికే డైవర్షన్ ఈ తరహా అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంకా ఏవరేమన్నారంటే... - గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ‘రెడ్ బుక్, ఈనాడు’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తూ, బీసీ సోదరుడైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో చట్టం ప్రకారం కాకుండా 'రెడ్ బుక్ రాజ్యాంగం' నడుస్తోంది. పత్రికల్లో వచ్చిన వార్తలనే ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చి ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. మోడల్ జత్వాని కేసులో దళిత ఐపీఎస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను నిర్దాక్షిణ్యంగా బలిగొన్నారు. క్రాంతి కుమార్ అంశం, కావలి, నెల్లూరులలో దళిత, ఎస్టీ మహిళలపై జరిగిన దాడులు, బద్వేల్, గండికోట, తుని ఘటనలలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, మెడిసిన్ పూర్తి చేసి, ప్రజలకు సేవ చేసిన డాక్టర్ అప్పలరాజు గారిపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం దారుణం. ప్రమాదంలో ఒకరు మరణించడం విచారకరమే, దానికి సంబంధించి లీగల్‌గా ఎంక్వయిరీ జరగాలి కానీ, తండ్రీకొడుకులను అరెస్ట్ చేసి వేధించడం దుర్మార్గం. బీసీలు, దళితులపై జరుగుతున్న ఈ అరాచకాలపై యువత, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌సీపీ కుటుంబం అప్పలరాజు గారికి పూర్తిగా అండగా ఉంటుంది, ఈ తప్పుడు చర్యలపై లీగల్‌గా, రాజకీయంగా పోరాడతాం. - పుత్తా శివశంకర్, రాష్ట్ర కార్యదర్శి. ఉత్తరాంధ్ర బీసీ నాయకులను అనగదొక్కేందుకే ఈ దొంగ కేసులు.. "కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై, ప్రజలకు దూరమవుతున్న తరుణంలోనే ఇటువంటి దొంగ కేసులు బనాయిస్తోంది. పొగాకు, ఆక్వా రైతులు సహా రాష్ట్ర ప్రజలంతా ఈ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ సాధించి, చంద్రబాబు గారి చేతుల మీదుగానే గోల్డ్ మెడల్ అందుకున్న అత్యంత సమర్థుడైన బీసీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు. రోడ్డు ప్రమాదం జరిగితే మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు నమోదు చేయాలి తప్ప, హత్య/హత్యాయత్నం కేసులు పెట్టడం భారతదేశంలో ఎక్కడా లేదు. గతంలో టీడీపీ నాయకుల పిల్లలు ప్రమాదాలు చేసినప్పుడు లేని కేసులు, ఇప్పుడు కావాలనే బనాయిస్తున్నారు. 'ఈనాడు' పత్రికలో వార్త రావడం, ఎనిమిది గంటల్లోనే అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడం చూస్తుంటే హోమ్ శాఖను ఎవరు నడుపుతున్నారో అర్థం కావడం లేదు. ఉత్తరాంధ్రలో మునుపెన్నడూ లేని కక్ష రాజకీయాలను చంద్రబాబు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారమే అన్నింటికీ సమాధానం చెప్తాం. ఇప్పటికైనా ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాం.