పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గంలో నిజమైన చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందకుండా అనర్హులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారంటూ మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట చేనేత కార్మికులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ మాట్లాడుతూ.. ఒక చీర తయారు చేయడానికి నేతన్న పడే కష్టం, మగ్గం ముందు గడిపే గంటలు, కుటుంబాన్ని పోషించేందుకు చేసే శ్రమను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాంటి నిజమైన చేనేత కార్మికులకు పథకాలు అందాల్సింది పోయి, ఇతర వృత్తుల్లో ఉన్న వారికి చేనేత పథకాల ప్రయోజనాలు అందుతున్నాయనే ఫిర్యాదులు రావడం బాధాకరమన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఒకే కుటుంబంలో నలుగురికి పథకం అందించారనే ఫిర్యాదులతో పాటు మద్యం దుకాణాలు, పంచర్ షాపుల్లో పనిచేసేవారు, చిప్స్ విక్రయించే వారు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు కూడా చేనేత పథకాలు అందుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. చేనేత పథకాలు రాజకీయ కార్యకర్తలకు పంచేందుకు కాదని, మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నిజమైన నేతన్న కుటుంబాలకు అండగా నిలవాల్సినవని ఉషశ్రీచరణ స్పష్టం చేశారు. నిజమైన చేనేత కార్మికులను గుర్తించి, అనర్హులను తొలగించాలని, ఒకే కుటుంబంలో పలువురికి అక్రమంగా ప్రయోజనాలు అందిన వ్యవహారాలపై విచారణ జరపాలని కోరారు. చేనేత పథకాల లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేసి, అర్హులైన ప్రతి నేతన్నకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. నేతన్నల హక్కుల కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఆమె తెలిపారు. మగ్గం ఆగకుండా, నేతన్న కుటుంబాలు ఆకలితో ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిజమైన చేనేత కార్మికులకు న్యాయం జరిగే వరకు, చేనేత పథకాలలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే వరకు తమ పోరాటం ఆగదని ఉషశ్రీచరణ స్పష్టం చేశారు.