స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్‌ ఆర్డర్లు

వెన్నుపోటు పార్టీ నియంతృత్వానికి ఇదే నిదర్శనం

లేళ్ల అప్పిరెడ్డి ఫైర్

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయ సంఘాల నేతలను సస్పెండ్‌ చేయడం దారుణం

కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండా ఉపాధ్యాయ సంఘాల నేతలపై సస్పెన్షన్‌ వేటు వేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం

ఐఆర్‌, పీఆర్సీ లేకుండా.. ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టి.. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెన్షన్లతో భయపెట్టడం ఏ విధమైన పాలన?

డీఎస్సీ పేపర్‌ లీకేజీ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన ప్రతి వ్యవహారంపై శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ నిలదీస్తుంది

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి.. మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి

ప్రశ్నించే గొంతులను సస్పెన్షన్లు, అరెస్టులు, అక్రమ కేసులతో అణచివేయడం ఆపాలి.. ప్రజాస్వామ్య విలువలను 
కాపాడాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన లేళ్ల అప్పిరెడ్డి 

తాడేపల్లి: స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేసి సాధించిన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన వేళ ప్రజలకు దారి చూపాల్సిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్‌ ఆర్డర్లు ఇవ్వడం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. తమ హక్కుల కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని కలవడం కూడా నేరంగా భావించే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకుంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. శనివారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

- వాళ్లు సంఘ విద్రోహ శక్తులు కాదు కదా?
స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సస్పెన్షన్‌ ఆర్డర్లు ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం? ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం వారి నేరమా? వాళ్లు సంఘ విద్రోహ శక్తులు కాదు.. సమాజానికి నష్టం చేసే వ్యక్తులు కాదు. కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా సస్పెండ్‌ చేయడం ద్వారా ప్రభుత్వం ఏం సందేశం ఇస్తోంది? అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనుకుంటే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది?.

- ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా?
రాష్ట్రంలో ఉద్యోగులకు ఐఆర్‌ లేదు, పీఆర్సీ లేదు, పీఆర్సీ కమిషన్‌ లేదు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల బకాయిలు సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉపాధ్యాయులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే వారిని భయపెట్టేందుకు సస్పెన్షన్‌ ఆర్డర్లు చేతిలో పెట్టడం ఏ విధమైన పాలన? టెట్‌ నుంచి ఇన్‌సర్వీస్‌ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రంతో మాట్లాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న మీరు కేంద్రాన్ని కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా వారిని సస్పెండ్‌ చేయడం ద్వారా రాష్ట్రంలో భయ వాతావరణం సృష్టించాలనుకోవడం సరికాదు.

- డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పాలి
డీఎస్సీ పేపర్‌ లీకేజీ నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు ప్రతి అంశంలోనూ అవకతవకలు జరిగాయి. పక్షపాత వైఖరితో నియామకాలు జరిగాయనే ప్రశ్నలు ఉన్నాయి. డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఉన్న అధికారులను ఒక్కొక్కరినీ బదిలీ చేశారు. కమిషనర్‌ను బదిలీ చేశారు, సెక్రటరీని బదిలీ చేశారు, శాఖకు సంబంధించిన అధికారులను బదిలీ చేశారు. చివరికి మిగిలింది మంత్రి లోకేష్‌ ఒక్కరే. అందుకే మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి. ఆ తర్వాత డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. పేపర్‌ లీకేజీ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు జరిగిన ప్రతి అంశాన్ని శాసనమండలిలో వైయ‌స్ఆర్‌సీపీ నిలదీస్తుంది. ప్రశ్నించిన వారిని సస్పెండ్‌ చేయడం, అరెస్టు చేయడం, అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయలేరు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకోవాలి” అని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. 

Back to Top