తాడేపల్లి: ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TET) నుంచి మినహాయింపు కల్పించాలనే న్యాయమైన డిమాండ్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ముగ్గురు ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా సస్పెన్షన్ వేటు వేయడంపై ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లారన్న అక్కసుతో, ఎటువంటి విచారణ మరియు ఆధారాలు లేకుండానే వాట్సాప్ పోస్టులను సాకుగా చూపి ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది పచ్చి నిజమని, అయితే ఆ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని ఉపాధ్యాయులను బలిపశువులను చేయడం దుర్మార్గమని ఆమె స్పష్టం చేశారు. విధుల నుంచి తప్పించిన ఉపాధ్యాయులపై తక్షణమే సస్పెన్స్ ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులతో కలిసి రోడ్డెక్కి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, పాఠాలు చెప్పే గురువులు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... - ఉపాధ్యాయులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కేవలం రాజకీయ కక్షసాధింపులే ధ్యేయంగా పరిపాలన సాగిస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించే గురువులపై కూడా 'రెడ్ బుక్ రాజ్యాంగం' అమలు చేసే స్థాయికి దిగజారిపోవడం అత్యంత దారుణం. ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎందుకంత కక్ష? ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం తప్పా? తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి వినతిపత్రం ఇస్తే, కడప జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వెంకటనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేయడం క్షమించరాని నేరం. మరో ఇద్దరు టీచర్లను కూడా సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ప్రశ్నించే వారి గొంతు నొక్కేయడమే ఈ ప్రభుత్వ విధానమా?" - డీఎస్సీ అక్రమాలకు టీచర్లతో ముడేంటి? డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయన్న మాట 100 శాతం వాస్తవం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి భుజాలు తడుముకుంటూ, ఆ వ్యవహారాన్ని ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులకు ముడిపెట్టాలని చూడటం హాస్యాస్పదం. ఆ ముగ్గురు ఉపాధ్యాయులు డీఎస్సీ అక్రమాలపై ఎక్కడా, ఎప్పుడూ మాట్లాడలేదు. వాట్సాప్‌లో ఎవరో పెట్టిన తప్పుడు పోస్టులను ఆధారంగా చేసుకుని జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఎలాంటి విచారణ జరపకుండా ఏకపక్షంగా సస్పెన్షన్ ఆర్డర్లు ఎలా ఇస్తారు? ఆ ఉపాధ్యాయులు డీఎస్సీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నట్లు డీఈవో వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలి." - గతంలో మీరేం చేశారు.. మేమేం చేశాం? నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ వందలాది మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆయన్ను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. గతంలో చంద్రబాబు స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులను ఢిల్లీకి తీసుకెళ్లి మహాధర్నాలు చేయించలేదా? అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలు తీసుకుందా? మరి నేడు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారనే అక్కసుతో టీచర్లపై వేధింపులకు దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. - కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయాలి 20 నుంచి 30 ఏళ్లుగా సర్వీస్‌లో ఉంటూ పదవీ విరమణకు దగ్గరపడిన వయసులో ఉపాధ్యాయులు టెట్ పరీక్షలు రాయలేరు. ఈ అంశంపై కేంద్రంలో భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. అందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి సమగ్రమైన వినతిపత్రం సమర్పించాం. దీనిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ తరపున ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు, కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. - సస్పెన్షన్లు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు.. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఉపాధ్యాయుల పక్షాన ఎందుకు పోరాడటం లేదు? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి టెట్ మినహాయింపు తేవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. హక్కుల కోసం పోరాడే ఉపాధ్యాయులపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరడం తప్పా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నాఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ (PRC), ఐఆర్ (IR), డీఏ (DA) బకాయిలు వంటి ఆర్థిక ప్రయోజనాలను ఒక్కటీ అమలు చేయలేదని. ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకపోగా, సమస్యలపై గళమెత్తితే సస్పెన్షన్లు, వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారుని కల్పలతారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఆ ముగ్గురు ఉపాధ్యాయులపై ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని... లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ లోకంతో కలిసి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం వారికి అన్ని వేళలా వైఎస్సార్సీపీ పూర్తి అండగా నిలబడుతుందని కల్పలతా రెడ్డి స్పష్టం చేశారు.