తాడేపల్లి: స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ఎప్పటికీ మరచిపోకూడదని పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి “స్వాతంత్ర్యం మనకు ఊరికే రాలేదు. వందల సంవత్సరాల పాటు అనేక రూపాల్లో జరిగిన పోరాటాల ఫలితంగానే 1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించింది. మహాత్మా గాంధీతో పాటు వివిధ రాజకీయ భావజాలాలకు చెందిన నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, సామాన్య ప్రజలు ఈ మహోన్నత పోరాటంలో భాగస్వాములయ్యారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులందరికీ ఘన నివాళులు అర్పించాలి. వారు అందించిన స్వేచ్ఛాయుత భారతదేశాన్ని, బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలి” అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర “స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి కృషి చేశాయి. అనేక రంగాల్లో పురోగతి సాధించాం. అయినప్పటికీ ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. ప్రతి భారతీయుడిలో దేశం పట్ల ప్రేమ, అభిమానం మరింత పెరగాలి. దేశ అభివృద్ధితోనే నా వ్యక్తిగత అభివృద్ధి ముడిపడి ఉందనే భావన ప్రతి పౌరుడిలో కలగాలి. దేశం కోసం అవసరమైనప్పుడు త్యాగానికి సిద్ధపడే పౌర సమాజాన్ని నిర్మించగలిగితేనే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది” అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలదే కీలక పాత్ర “ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర అత్యంత కీలకం. ప్రజల తీర్పుతోనే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలను, ప్రజల హక్కులను హరిస్తున్న చర్యలను ప్రజలే ప్రశ్నించాలి. రాజకీయ చైతన్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను, స్వేచ్ఛగా పనిచేయాల్సిన మీడియాను నియంత్రించే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి. వాస్తవాలను ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నాలను అధిగమించే శక్తి ప్రజలకు ఉంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రభుత్వాలను ఎన్నుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత” అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేయాలి “శ్రీకాకుళం జిల్లాలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను సాధించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను సాధించుకున్నాం. ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలి. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత లభించాలి. రాబోయే రోజుల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పనిచేయాలి” అని ఆయన అన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో ఆశయాల సాధన “వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో, మనకు మార్గదర్శకులైన కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం. భారతదేశం వర్ధిల్లాలి” అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.