వైయ‌స్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. 

అబద్ధాలతో ప్రజలను మోసం చేయొద్దు

మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ 

డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మహిళా సాధికారతకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం

జగన్ లేవనెత్తిన ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలు చెప్పాలని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్

తాడేపల్లి :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ–జనసేన కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు, అసత్య ప్రచారాలను ఆశ్రయిస్తోందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌కు సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీ రాయితీ పథకానికి రూ.4,969 కోట్లు ఖర్చు చేసిందని, వైఎస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశామని బుగ్గన గుర్తు చేశారు. అలాగే వైఎస్సార్ చేయూత ద్వారా రూ.19,189 కోట్లు అందించడంతో పాటు మహిళలు, స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఇవన్నీ అధికారిక రికార్డుల్లో ఉన్న వాస్తవాలని, వాటిని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

 జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ రహిత రుణాల పరిమితిని పెంచుతామని టీడీపీ–జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఓట్లు అడిగింది నిజం కాదా అని బుగ్గన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, లక్షలాది మంది మహిళలను మోసం చేశారని ఆరోపించారు.

అంతేకాకుండా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల రుణాల వృద్ధి కూడా కూటమి పాలనలో వరుసగా తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని బుగ్గన ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26లో రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం (Own Tax Revenue) -3.22 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేయడం రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి నిదర్శనమన్నారు. వైయస్ జగన్ లేవనెత్తిన అంశాల్లో ఒక్కదానికైనా ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

 వైఫల్యాలను అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పాలి

జగన్ చెప్పిన అంశాలు తప్పని నిరూపించే ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని బుగ్గన సవాల్ విసిరారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరించి ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఒప్పుకోవాలని, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలు మానేసి, మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రభుత్వాన్ని కోరారు.
 

Back to Top