అనంతపురం : కరువుతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయలసీమకు హంద్రీనీవా ప్రాజెక్టు జీవనాడి అని, అదనపు జలాల సాధనే లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని, ఈనెల 19న కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీనీవా పనులను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. అనంతపురంలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని అన్ని జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు అధ్యయనం చేసి, అదనపు జలాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాయని తెలిపారు. హంద్రీనీవా ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి ప్రాజెక్టు లక్ష్యాన్నే దెబ్బతీసిందని విమర్శించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ఆ నిర్ణయాన్ని రద్దు చేసి తిరిగి 40 టీఎంసీల సామర్థ్యంతో పనులను వేగవంతం చేశారని, దాని ఫలితంగానే 2012లో కృష్ణా జలాలు జీడిపల్లి వరకు చేరాయని చెప్పారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హంద్రీనీవా కాలువను 6,300 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించే పనులకు శ్రీకారం చుట్టి టెండర్లు కూడా పూర్తి చేశామని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్లీ దానిని 3,850 క్యూసెక్కులకే పరిమితం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం రూ.3,850 కోట్లతో పనులు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, అనుకున్న స్థాయిలో నీరు రాలేదని అన్నారు. 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిజంగా నీరు వచ్చి ఉంటే 170 రోజుల్లోనే 51 టీఎంసీలు వచ్చేవని, మరి 242 రోజులు ఎందుకు పట్టిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రధాన కాలువను కుదించి బ్రాంచ్ కెనాళ్లను పెంచడం వల్ల అసలు లక్ష్యమే దెబ్బతింటోందని, లైనింగ్ పనుల కారణంగా భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, రాయలసీమకు తక్కువ సమయంలో ఎక్కువ నీటిని అందించాలంటే హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం తమ బాధ్యత అని అన్నారు. ఆల్మట్టి, అప్పర్ భద్ర, తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా రాయలసీమ నీటి హక్కులకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభ దశలోనే దాని సామర్థ్యాన్ని కుదించి దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఈనెల 19న చోళసముద్రం వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.