తాడేపల్లి : ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలను స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, బలవంతంగా వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గౌరవించకుండా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం గతంలో తీవ్రంగా వేధించి అవమానాలకు గురిచేసిందని అన్నారు. అలాంటి ప్రభుత్వ లాంఛనాలు తమకు అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పారని తెలిపారు. వారి అభీష్టానికి విరుద్ధంగా బలవంతంగా అధికార లాంఛనాలు నిర్వహిస్తే ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరదనే ఉద్దేశంతోనే తాము అడ్డుకున్నామని చెప్పారు. కుటుంబ సభ్యులు వద్దని చెప్పిన తర్వాత కూడా పోలీసులు దొంగచాటుగా గేట్లు దూకి ఇంట్లోకి ప్రవేశించడం చట్టవిరుద్ధమని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. "అది ముద్రగడ ఇల్లు... అక్కడ ఏం జరగాలో కుటుంబ సభ్యులే నిర్ణయిస్తారు. వారి అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించే హక్కు పోలీసులకు లేదు" అని అన్నారు. తనపై ఇప్పటికే అనేక కేసులు నమోదు చేస్తున్నారని, ప్రతి చిన్న విషయానికీ కేసులు పెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ముద్రగడ నివాసంలోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసు అధికారులపై ట్రెస్‌పాస్ కేసు నమోదు చేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.