రాష్ట్రంలో పరిపాలన గాలికెగిరిపోయింది

చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా స్కామ్‌లే

శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌

ప్రజా సమస్యలపై పార్లమెంటులో గొంతెత్తాలి

డీఎస్సీ స్కామ్, టీచర్లకు టెట్, ప్రశ్నిస్తే వేథింపులు

అక్రమ కేసులు, అరెస్టులు, సంక్షోభంలో వ్యవసాయం

కష్టాల్లో ఆక్వా రైతులు, సమస్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు

విపరీతంగా అప్పులు. రాష్ట్రం అప్పులకుప్ప

వీటన్నింటినీ ఉభయసభల్లో గట్టిగా వినిపించాలి

పార్టీ ఎంపీలకు శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశం

పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ అధ్యక్షతన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం. 

ఈనెల 20 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశం.

సమావేశానికి హాజరైన పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు. 

లోకసభలో వైయస్సార్‌సీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు ఎం.గురుమూర్తి, వైయస్‌.అవినాష్‌రెడ్డి, 
గుమ్మా తనూజారాణి.

ప్రత్యేక ఆహ్వానితులకుగా సమావేశానికి హాజరైన మాజీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.

తాడేపల్లి: ష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా గాడితప్పిందని, డీఎస్సీ స్కామ్‌ నుంచి భూ కుంభకోణాలు, ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణ, రైతులు, ఉద్యోగులు, ఆక్వా రైతుల సమస్యలు, అక్రమ కేసులు, అరెస్టులు, విపరీతమైన అప్పులు వరకు ప్రతి రంగంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటినీ ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల్లో బలంగా ప్రస్తావించి, ప్రజల తరఫున గట్టిగా పోరాడాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు, లోక్‌సభలో వైయస్సార్‌సీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు ఎం. గురుమూర్తి, వైయస్ అవినాష్‌రెడ్డి, గుమ్మా తనూజారాణి, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు.
    వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

డీఎస్సీ 2025 ఒక పెద్ద స్కామ్‌:
    రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. వాటి కోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద స్కాం చోటు చేసుకుంది. అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ఇంకా డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్‌పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధ్యక్షుడు. జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్‌ తోడల్లుడు భరత్‌ ఉన్నాడు. 

అడ్డగోలుగా భూపందేరాలు.
అంతులేని అవినీతి పర్వం:
    మరోవైపు రాష్ట్రంలో ఇష్టాను సారంగా భూముల పందేరం జరుగుతోంది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్‌ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది. అటు అమరావతి నిర్మాణంలోకూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే.  
    పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. 
ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. 

ప్రశ్నిస్తే వేధింపులు. అరాచకాలు:
    ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా పేరిట చంద్రబాబుగారు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. 

టీచర్లకు ‘టెట్‌’ ఇబ్బందులు:
    టెట్‌ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. 
టెట్‌ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు టెట్‌ తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులు అయిన వారే. వీళ్లు ఉద్యోగాలు పొందనప్పుడు వీళ్లకు టెట్‌ అనే పరీక్ష లేదు. కానీ, ఇప్పుడు వీరిని టెట్‌ రాయమనడం భావ్యం కాదు. 
సుదీర్ఘ కాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్‌ పరీక్ష రాయమనడం, దాన్ని తప్పనిసరి చేయడం ఏ మాత్రం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి. వారికి సమస్యను నివేదించాలి.  

ప్రజా ఆస్తులు పప్పుబెల్లాల్లా పంపకం:
    రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు.
ప్రైవేటు పేరుతో ఎక్కడిక్కడ దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. నిజానికి ఆయా ప్రాజెక్టుల పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని, ఇంకా దాదాపు పూరై్తన వాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కాం ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇవ్వడం స్కాం కాదా? 
ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి. 

అప్పుల్లో రికార్డు. ప్రతిచోట అవినీతి. దోపిడి:
    ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, లిక్కర్, మైన్స్‌.. దేన్నీ వదలకుండా దోపిడి చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇంకా ఈ ప్రభుత్వం అడ్డగోలుగా ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అప్పుల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పు చేశారు. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారు. ఊఖఆM చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం. 
    మరోవైపు సిండికేట్‌ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం కూడా చాలా నష్టపోతోంది. భీమవరం సభ ద్వారా ఆక్వా రైతులు ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు
    మరోవైపు ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. 
పీఆర్సీ లేదు. ఐఆర్‌ లేదు. 5 డీఏలు పెండింగ్‌. సరెండర్‌ లీవ్స్‌ పెండింగ్‌.  ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే. 
    వీటన్నింటినీ పార్లమెంటు ఉభయ సభలో లేవనెత్తాలి. ఈ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలి. ముఖ్యంగా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పార్టీ ఎంపీలకు శ్రీ వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు.

Back to Top