డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి 

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

డీఎస్సీ నియాక‌మ ప్ర‌క్రియ‌లో భారీ అవ‌క‌త‌వ‌క‌లు 

నోటిఫికేష‌న్ నుంచి ఉద్యోగాల భ‌ర్తీ వ‌ర‌కు ఎన్నో అక్ర‌మాలు

ఆధారాల‌తో స‌హా నిరూపించినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు 

త‌ప్పు చేయ‌న‌ప్పుడు ప్ర‌భుత్వం సీబీఐ విచార‌ణ ఎందుకు కోర‌డం లేదు? 

సూటిగా ప్ర‌శ్నించిన లేళ్ల అప్పిరెడ్డి 

తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ - 2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ స్పోర్ట్స్ డీఎస్సీ పేరుతో జ‌రిగిన నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్ప‌టికే దీనిపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌హా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధారాల‌తో స‌హా మీడియా ముందుకు తీసుకొచ్చినా లోకేష్ సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా స‌వాల్ పేరుతో మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. లోకేష్ స‌వాల్‌ని తాము ఎప్పుడో స్వీక‌రించామ‌ని, డేటు, టైం చెబితే బ‌హిరంగంగా చ‌ర్చించ‌డానికి మా పార్టీలో అంద‌రూ సిద్ధంగానే ఉన్నార‌ని స్పష్టం చేశారు. అంతేకానీ వైఎస్ జ‌గ‌న్ గారితో చ‌ర్చించే స్థాయికి లోకేష్ ఇంకా ఎద‌గ‌లేద‌ని, ఆయ‌నే చ‌ర్చ‌కు రావాలంటే సీఎం చంద్ర‌బాబుని చ‌ర్చ‌కు ఒప్పించాల‌ని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతోపాటు టీడీపీ కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ఎన్నికల హామీ మేరకు అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున 24 నెలలుగా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు భారీగా స్పందించారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.
 
ఆయన ఇంకా ఏమ‌న్నారంటే... 

డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భారీ అక్రమాలు 

రాష్ట్రంలో డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో అడుగడుగునా భారీ అక్రమాలు జరిగాయి. అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. స్పోర్ట్స్ కోటాను కూడా దుర్వినియోగం చేసి నిబంధనలను మార్చి తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకుని అర్హులైన వారికి అన్యాయం చేశారు. క్రీడల్లో సాధించిన మెడల్స్ ఆధారంగా కాకుండా, టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులు, వారు పెట్టిన క్రీడా కమిటీల సర్టిఫికెట్లతో అక్రమంగా స్పోర్ట్స్ కోటా పోస్టులను దుర్వినియోగం చేశారు. పరీక్షలు పూర్తయ్యాక తమ వారికి లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మారుస్తూ జీవోలు ఇచ్చారు. డీఎస్సీలో జ‌రిగిన అక్ర‌మాల‌పై ఆధారాల‌తో స‌హా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. నియామ‌క ప్ర‌క్రియ‌లో నిజాయితీగా వ్యవహరించి ఉంటే సీబీఐ విచారణకు ప్ర‌భుత్వం ఎందుకు వెనుకాడుతోంది. డీఎస్సీ అంశంపై చర్చకు రావాలని లోకేష్ విసిరిన సవాల్‌ను వైఎస్సార్సీపీ ఆరోజే స్వీకరించింది. తేదీ, సమయం, వేదికను ప్రభుత్వం నిర్ణయిస్తే ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. లోకేష్ కోరుకున్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడైనా చర్చలో పాల్గొంటారు. 

ఏ త‌ప్పూ చేయ‌న‌ప్పుడు భ‌యం దేనికి? 

ప్రభుత్వం నిజాయితీగా ఉంటే, ఎక్కడైనా తప్పు జరగలేదని భావిస్తే తక్షణమే ఈ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? మీరు తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఈ మొత్తం అక్రమాలకు మూలకారకుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. పేద విద్యార్థులకు రావలసిన దాదాపు రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎన్నికల హామీ ప్రకారం ప్రతి అర్హత కలిగిన నిరుద్యోగికి నెలకు రూ. 3 వేల చొప్పున, గత 24 నెలలకు సంబంధించి రూ. 72 వేలు తక్షణమే చెల్లించాలి.

జ‌గ‌న్ తో చ‌ర్చించే స్థాయి లోకేష్‌కి లేదు  

నారా లోకేష్ స్థాయి, జగన్ గారి స్థాయి ఒకటేనా? నీకు నిజంగా మా నాయకుడు వైఎస్ జగన్ గారితో చర్చించాలనే ఆలోచన ఉంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చకు రావాలి, లేదా నువ్వు నీ నాన్నను దింపి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ గారితో మాట్లాడాలి. నీతో చర్చించడానికి మా పార్టీకి చెందిన మాజీ మంత్రులు కన్నబాబు గారు, పేర్ని నాని గారు, చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు అనేకమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. అర్ధరాత్రి పిలిచినా కాగితాలు పట్టుకుని రావడానికి మా వాళ్లు సిద్ధం. మీరే తేదీ, సమయం, వేదిక ఖరారు చేయండి! 

రీయింబ‌ర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి బ‌కాయిలు విడుద‌ల చేయాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు దిగ్విజయంగా జ‌రిగాయి. ఈ పోరాట ధాటికి కూటమి ప్రభుత్వ కూసాలు కదులుతున్నాయి. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, 3.5 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలి, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఉద్యమాల్లో పాల్గొనడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఢిల్లీలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top