తాడేపల్లి: మెగా డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి చోటా పెద్ద ఎత్తున నిరుద్యోగులు, జెన్–జీ బ్యాచ్ ఇంకా యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారని ఆయన వెల్లడించారు. దీంతో దిక్కుతోచని ప్రభుత్వం, ఎవరెవరితోనో మాట్లాడిస్తూ విమర్శలు, నిందల పర్వం కొనసాగిస్తోందని తెలిపారు. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ, మెగా డీఎస్సీ నిర్వహణలో ఎన్నో అక్రమాలు చేశారని, వాటికి బాధ్యత వహిస్తూ, మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్ ఇంకా ఏం మాట్లాడారంటే..: ర్యాలీలతో హోరెత్తిన రాష్ట్రం: వైయస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు మరియు జెన్–జీ బ్యాచ్ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని చోట్లా నిరసన ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. 3.50 లక్షల మంది టీచర్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేక యువత అంతా ఏకమై ఉద్యమ బాట పట్టారు. వైయస్సార్‌సీపీ కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందనను చూసి ఓర్చుకోలేక కూటమి నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆధారాలతో సహా ప్రశ్నిస్తే పారిపోతున్న ప్రభుత్వం: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై గత రెండు నెలలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంది. మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్, డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో సహా, 100 ప్రశ్నలు లేవనెత్తితే ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేకపోయారు. ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక అధికారుల వెనుక దాక్కోవడం లేదా జగన్‌గారిపై అదేపనిగా తిట్లు లంకించుకోవడం అలవాటుగా మారింది. ఇకనైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మాను లోకేష్: శంకుస్థాపనల సాకుతో తాడేపల్లి వచ్చిన మంత్రి నారా లోకేష్, జగన్‌గారిని ఛాలెంజ్ చేస్తూ, ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. సొంత కార్యకర్తల మధ్య చప్పట్లు కొట్టించుకోవడానికి, ఎల్లో మీడియా ఎలివేషన్స్ కోసమే లోకేష్ ఈ నాటకాలు ఆడుతున్నారు. అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారే తప్ప.. డీఎస్సీలో తప్పు జరగలేదని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. గతంలో ఓడిపోయి, తొలిసారి ఎమ్మెల్యే, ఆపై మంత్రి అయిన లోకేష్‌కి, జగన్‌గారికి సవాల్ చేసే స్థాయి ఎంత మాత్రం లేదు. డీఎస్సీ అక్రమాలపై చర్చించడానికి మా పార్టీలోని మాజీ మంత్రులు మరియు అధికార ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మే 28నే ఓపెన్ ఛాలెంజ్ విసిరినా కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎందుకు స్పందన లేదు? మీకు దమ్ముంటే ఇప్పటికైనా సమయం మరియు స్థలం మీరైనా నిర్ణయించండి. లేకపోతే మాజీ మంత్రి పేర్ని నాని ఫిక్స్ చేసిన తేదీకైనా వస్తే చర్చించడానికి మేము రెడీగా ఉన్నాము. డీఎస్సీ పారదర్శకతను భ్రష్టు పట్టించారు: డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటేనే జిల్లా స్థాయి నియామకాలు. కానీ పారదర్శకత లేకుండా ఫలితాలను రాష్ట్ర స్థాయిలో ఎందుకు విడుదల చేశారు. స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్రతిభావంతులైన అభ్యర్థులను పక్కన బెట్టి కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. బాధితులే స్వయంగా జగన్‌గారి ప్రెస్ మీట్‌లో కూర్చుని తమకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఆధారాలతో సహా వివరించారు. అయినా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. లోకేష్ రాజీనామా చేయాలి: సీబీఐ విచారణకు ఎందుకు భయం?: డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే మీరు, కేంద్రంలో నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. యువత డిమాండ్లకు తలొగ్గి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడినట్లే లోకేష్ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. కేంద్రంలోని భాగస్వామ్య పార్టీ నేతలు పాటించిన కనీస రాజకీయ విలువలను లోకేష్ ఎందుకు పాటించడం లేదు?. ఇంకా డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? ప్రభుత్వానికి ఏ మాత్రమైనా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంటనే సీబీఐతో విచారణ కోరాలని పుత్తా శివశంకర్ తేల్చి చెప్పారు.