అక్రమ కేసులతో మత్స్యకార నాయకులను వేధిస్తున్న కూటమి ప్రభుత్వం

డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు అండగా 30న శ్రీకాకుళం రానున్న వైయ‌స్ జగన్‌

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్  వెల్ల‌డి

శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30న చేపట్టనున్న శ్రీకాకుళం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. అక్రమ కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును వైయ‌స్ జగన్‌ ములాఖత్‌లో కలిసి ధైర్యం చెప్పనున్నారని తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమానికి వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని వారు పేర్కొన్నారు. పాకిస్తాన్‌ జైళ్లలో నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడంతో పాటు వారికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు. మత్స్యకార సామాజికవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించి, మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా గౌరవం కల్పించారని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ పనులను వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అలాంటి మత్స్యకారులపై ప్రస్తుతం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు అండగా నిలిచేందుకు ఈ నెల 30న జిల్లాకు వస్తున్న వైయ‌స్ జగన్‌కు ఘన స్వాగతం పలకాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పర్యటనను విజయవంతం చేయాలని ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు.
 

Back to Top