మెగా డీఎస్సీ అక్రమాలపై రగిలిన జెన్‌–జీ

 రాష్ట్రవ్యాప్త నిరసనలు విజయవంతం

విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అండగా పోరాటం మరింత ఉధృతం

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మరోసారి జెన్‌–జీ ఆగ్రహం పెల్లుబికిందని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన గళం వినిపించారని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన నిరసన ర్యాలీలు ఘన విజయం సాధించాయని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని నిరసనల్లో యువత ముక్తకంఠంతో డిమాండ్‌ చేసిందన్నారు. పేపర్‌ లీకేజీ ఆరోపణల నుంచి స్పోర్ట్స్‌ కోటా నియామకాల వరకు డీఎస్సీ వ్యవహారం మొత్తంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరిందన్నారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాల్సిన యువతను రోడ్డెక్కించి పోరాటాలు చేసే పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని వైయ‌స్ జగన్‌ మండిపడ్డారు.

ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివారని, కానీ పేపర్‌ లీకేజీ, నియామకాల్లో అక్రమాల ఆరోపణలతో వారి ఆశలు ఆవిరయ్యాయని పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారానికి సంబంధించి ఆధారాలు, పత్రాలు బయటకు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానం చెప్పకుండా అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని వైయ‌స్ జగన్‌ స్పష్టం చేశారు. వారి డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ, యువత భవిష్యత్తు కోసం, వారికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని వైయ‌స్ జగన్‌ స్పష్టం చేశారు.
 

Back to Top