డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి

ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు

వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా

తూర్పుగోదావరి: డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. నీట్ అవకతవకలపై ఢిల్లీలో విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని యువత కూడా తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరిస్తే ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. చదువు పూర్తయినా ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళనలు చేసినప్పుడే ప్రభుత్వం కొంతమేర నిధులు విడుదల చేస్తోందని, పెండింగ్ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైయ‌స్ జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన, వసతి దీవెనతో విద్యార్థులకు అండగా నిలవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యారని విమర్శించారు.

ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని జక్కంపూడి రాజా మండిపడ్డారు. కర్నూలులో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థి నాయకుడికి మద్దతుగా వెళ్లిన తనపైనా కేసు నమోదు చేశారని తెలిపారు. కేసులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. మహిళలకు ఇస్తామన్న రూ.1,500, వాలంటీర్లకు ఇస్తామన్న రూ.10 వేల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులు, యువతకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు.
 

Back to Top