తాడేపల్లి: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా కోరుతూ జూలై 28న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ తరహా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని రవిచంద్ర స్పష్టం చేశారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు, మెగా డీఎస్సీ వ్యవహారంలో నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండానే లక్షల రూపాయలకు అమ్ముకున్నారని, లోకేష్ కనుసన్నల్లోనే డీఎస్సీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గత వైయస్ జగన్ ప్రభుత్వంలో 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తుచేశారు. కానీ 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ అంటూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా దగా చేసిందన్నారు. లోకేష్ రాజీనామా చేసే వరకు నిరుద్యోగులు, విద్యార్థులు, యువతతో కలిసి సమరశీల ఉద్యమాలను కొనసాగిస్తామని ఎ. రవిచంద్ర స్పష్టం చేశారు.