తాడేపల్లి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు, వరుసగా చోటుచేసుకుంటున్న లాకప్‌డెత్‌లు, ఆత్మహత్యలు, పోలీసు వేధింపుల ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందని, రాజ్యాంగబద్ధంగా జీవించే పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారాయని విమర్శించారు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ ఏమైందని, ఆయన తల్లి సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపైనా విచారణ జరగాలన్నారు. మాల గంగమ్మ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఆమెకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన ఒక తల్లి చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దర్గయ్య అనే వ్యక్తిని కూడా చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసులు తమంతట తామే శిక్షలు విధించే పరిస్థితి వస్తే న్యాయస్థానాల అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎం.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పౌరహక్కులు, ప్రశ్నించే గొంతులపై అణచివేత పెరిగిందని ఆరోపించారు. మాల గంగమ్మ తన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ విచారణలోనూ ఆమె వేధింపులకు గురయ్యారని ఆరోపించారు. మాల గంగమ్మ మృతి సహా మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించడంతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.