తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైంది. డీఎస్సీలో దగాపడిన అభ్యర్థులకు అండగా పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటకు వచ్చినా ప్రభుత్వం బాధ్యత వహించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ పేర్కొంది. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన కీలకమైన నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారని, అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారని వైయస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఇందుకోసం నిబంధనలను మార్చడంతో పాటు ఏకంగా జీవోలు కూడా తీసుకొచ్చారని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బాధ్యత వహించకుండా తప్పించుకోవడం ఏమిటని నిలదీసింది. డీఎస్సీపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలంటే సీబీఐ విచారణకు ఆదేశించడమే మార్గమని స్పష్టం చేసింది. పరీక్ష కోసం నెలల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించినట్లుగానే రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని పేర్కొంది. డీఎస్సీలో దగాపడిన ప్రతి అభ్యర్థికీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానుంది.