డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

పేపర్‌ లీక్‌, మెరిట్‌ లిస్ట్‌ మాయం, స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

వైయ‌స్ఆర్‌సీపీ  అధికార ప్ర‌తినిధి గూడ‌పురెడ్డి వీర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్ర‌తినిధి గూడ‌పురెడ్డి వీర‌శేఖ‌ర్ రెడ్డి

సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సమగ్ర విచారణతో వాస్తవాలు బయటపెట్టాలి

రెండేళ్లలో నాడు- నేడు పనులను నిలిపేసి ప్రభుత్వ పాఠశాలలను భ్ర‌ష్టుప‌ట్టించారు 

గోరుముద్దను అధ్వాన్నంగా మార్చి విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారు

ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ, ట్యాబ్‌ల వంటి విద్యా సంస్కరణలను వెనక్కి నెట్టారు

ప్ర‌భుత్వ బడుల్లో 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గడం విద్యాశాఖ వైఫల్యం కాదా?

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన లోకేష్‌కు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు

వీరశేఖర్ రెడ్డి ధ్వ‌జం 

తాడేప‌ల్లి: మెగా డీఎస్సీ-2025లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి గూడ‌పురెడ్డి వీర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన మెగా డీఎస్సీ పేపర్ లీక్, మెరిట్‌ లిస్ట్‌లో పేర్ల మాయం, డేటా డిలీట్‌, 1:1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీ సహా అనేక అంశాల్లో అభ్య‌ర్థుల్లో తీవ్ర అనుమానాలు ఉన్నాయని మండిప‌డ్డారు. వీటిపై వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాలంటే సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు. రెండేళ్ల కూట‌మి పాల‌న‌లో నాడు- నేడు పనులను నిలిపేసి ప్రభుత్వ పాఠశాలలను భ్ర‌ష్టుప‌ట్టించారని, గోరుముద్దను అధ్వాన్నంగా మార్చి విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని మండిప‌డ్డారు. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ, ట్యాబ్‌ల వంటి విద్యా సంస్కరణలను వెనక్కి నెట్టడంతోపాటు ప్ర‌భుత్వ బడుల్లో 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గడం విద్యాశాఖ వైఫల్యం కాదా? అని ప్ర‌శ్నించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన లోకేష్‌కు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

- డీఎస్సీలో ఇన్ని ప్రశ్నలకు సమాధానాలేవి?

దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం యువతను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. దానికి బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా స‌మ‌ర్పించారు. అదే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీలో పేపర్‌ లీకులు, డేటా డిలీట్లు, మెరిట్‌ లిస్ట్‌ల మాయం వంటి అనేక అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం ఎందుకు రావడం లేదు? డీఎస్సీ నోటిఫికేషన్‌ అనంతరం ఎస్సీఈఆర్టీ డైరెక్ట‌ర్‌కి టెట్ క‌న్వీన‌ర్ గా నియ‌మించ‌డం, డీఎస్సీ బాధ్యతలు అప్పగించడంతో మొద‌లై ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడింగ్‌ ప్రక్రియతోపాటు టీచ‌ర్ నియామ‌కాల వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలోనూ ఎన్నో అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేసుకున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

- స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ నవీన్‌ పేరు ఎందుకు మాయమైంది?

ఎస్సీఈఆర్టీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన నవీన్‌ వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది. తొలుత విడుదల చేసిన మెరిట్‌ లిస్ట్‌లో నవీన్‌ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉంటే, రెండో జాబితాలో ఆయన పేరు ఎందుకు మాయమైంది? రెండో ర్యాంక్‌ నుంచి మాత్రమే మెరిట్‌ లిస్ట్‌ను ఎందుకు చూపించారు? నిజంగా ఆయన మెరిట్‌తోనే మొదటి ర్యాంక్‌ సాధించి ఉంటే ఆయన డేటాను ఎందుకు తొలగించారు?
నవీన్‌ తనకు 89.74 మార్కులతో స్కూల్‌ అసిస్టెంట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందని పేర్కొన్నా, తర్వాత మెరిట్‌ లిస్ట్‌లో పేరు లేకపోవడం ఏమిటి? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన డీఎస్సీ ఐడీ ఎందుకు బ్లాక్‌ అయింది? ఈ వ్యవహారం తర్వాత ఆయనను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు? ప్రభుత్వం వీటన్నింటికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి.

- 1:1 వెరిఫికేషన్‌కు పిలిచి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?

డీఎస్సీ ప్రక్రియలో మెరిట్‌ లిస్ట్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ను పారదర్శకంగా ప్రకటించాలి. కానీ ఈసారి హారిజాంటల్‌, వర్టికల్‌ రిజర్వేషన్ల విషయంలోనూ అనేక ప్రశ్నలు తలెత్తాయి. అభ్యర్థులకు నేరుగా ఫోన్‌ మెసేజ్‌ల ద్వారా 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని 1:1 నిష్పత్తిలో పిలిచి, అతని సర్టిఫికెట్లన్నీ సరైనవేనని నిర్ధారించిన తర్వాత కూడా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఆ పోస్టు మరొకరికి ఎలా వెళ్లింది? నిజమైన అర్హులకు ఇది అన్యాయం కాదా? బాధిత డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?

- స్పోర్ట్స్‌ కోటాలో 400కు పైగా పోస్టులపై విచారణ జరపాలి

స్పోర్ట్స్‌ కోటా వ్యవహారంలోనూ తీవ్ర అనుమానాలు ఉన్నాయి. పాత విధానాన్ని మార్చి డీఎస్సీ, టెట్‌ వంటి అర్హతల విషయంలో నిబంధనలను సడలిస్తూ కొత్త విధానం ఎందుకు తీసుకొచ్చారు? అదే విధానం సరైనదైతే డీఎస్సీ పూర్తయిన తర్వాత మళ్లీ నిబంధనలను ఎందుకు మార్చారు? స్పోర్ట్స్‌ కోటాలో 400కు పైగా పోస్టుల భర్తీ విషయంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు కాల్‌ రికార్డులు ఉన్నాయని, ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రభుత్వం వాటిపై నిష్పాక్షిక విచారణ ఎందుకు జరపడం లేదు? జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు అవకాశాలు దక్కకపోవడంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

- సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి

పేపర్‌ లీకేజ్‌ అనుమానాలు, నవీన్‌ వ్యవహారం, మెరిట్‌ లిస్ట్‌, స్పోర్ట్స్‌ కోటా జీవోలు, పాలసీ మార్పులు, హారిజాంటల్‌–వర్టికల్‌ రిజర్వేషన్లు, 1:1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఇలా ప్రతి అంశంపైనా వైయ‌స్ఆర్‌సీపీ ఆధారాలతో ప్రశ్నిస్తోంది. డీఎస్సీలో మోసపోయామని అభ్యర్థులు రోడ్డెక్కి ప్ర‌శ్నిస్తున్నారు. నిజంగా ఎలాంటి అక్రమాలు జరగకపోతే ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించకుండా సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి. మెగా డీఎస్సీలో జరిగిన పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలి.

- నాడు–నేడు బడులను ఎందుకు నిర్వీర్యం చేశారు?

వైఎస్ జగన్ గారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే సంకల్పంతో నాడు–నేడు ద్వారా మొదటి విడతలో 15,713 పాఠశాలలను అభివృద్ధి చేశారు. రెండో విడతలో 21,974 పాఠశాలల్లో పనులు వివిధ దశలకు చేరుకున్నాయి. నాడు-నేడు కోసం రూ.8,389 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి సుమారు రూ.3,500 కోట్లు అవసరమైనా వాటిని కేటాయించకుండా పనులను నిలిపివేశారు.
నాడు-నేడు పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ, ఆర్వో ప్లాంట్ల నిర్వహణను కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను నిలిపివేయడం విద్యారంగంపై నిర్లక్ష్యం కాదా?

- ‘గోరుముద్ద’ను అధ్వాన్నంగా మార్చేశారు

వైఎస్ జగన్ గారి పాల‌న‌లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో జగనన్న గోరుముద్దలో విభిన్న మెనూ, రాగిజావ, చిక్కీ తదితరాలను అందించారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కలుషిత ఆహారం, కలుషిత నీరు, నాసిరకం భోజనం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాచిపోయిన గుడ్లు, నాణ్యతలేని భోజనం అందిస్తున్నారంటూ విద్యార్థులే ఆందోళనలకు దిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? హాస్టళ్లలో ఎలుకలు కరవడం, మలేరియా, డెంగ్యూ వంటి సమస్యలతో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై విద్యాశాఖకు బాధ్యత లేదా?

- ఇంగ్లీష్‌ మీడియం నుంచి ట్యాబ్‌ల వరకు అన్నీ వెనక్కి

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ విధానం, విద్యార్థులకు ట్యాబ్‌లు, బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక వంటి విప్లవాత్మక కార్యక్రమాలను వైఎస్ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు వాటిలో అనేకం నిలిచిపోయాయి లేదా నిర్వీర్యమయ్యాయి.
2018-19లో ప్రభుత్వ పాఠశాలల్లో 38,90,743 మంది విద్యార్థులు ఉంటే, 2023-24 నాటికి ఆ సంఖ్య 40,50,116కు పెరిగింది. అంటే వైఎస్‌ జగన్‌ పాలన ముగిసే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.59 లక్షల మంది విద్యార్థులు పెరిగారు.
కానీ 2024-25లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 36 లక్షలకు పడిపోయింది. 2025–26 నాటికి 34,93,450కు తగ్గింది. అంటే రెండు సంవత్సరాల్లోనే 5,56,666 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గిపోయారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదేనా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం?

- విద్యాశాఖను భ్రష్టు పట్టించిన లోకేష్‌ రాజీనామా చేయాలి

ఒకవైపు నాడు-నేడు నిర్వీర్యం, మరోవైపు గోరుముద్దలో సమస్యలు, ఇంగ్లీష్‌ మీడియం-సీబీఎస్‌ఈ-ఐబీ వంటి సంస్కరణలకు వెనుకడుగు, ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య.. చివరకు ఉపాధ్యాయులను నియమించాల్సిన డీఎస్సీ ప్రక్రియపైనా తీవ్రమైన ఆరోపణలు. ఇన్ని వైఫల్యాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు?

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ తన శాఖలో జరుగుతున్న పరిణామాలకు నైతిక బాధ్యత వహించాలి. మెగా డీఎస్సీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణకు సిద్ధపడాలి. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మంత్రి పదవికి బేషరతుగా రాజీనామా చేయాలి.

ప్రభుత్వ విద్యను నిజంగా బలోపేతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రారంభించిన నాడు-నేడు పాఠశాలలను పూర్తి చేయండి. ప్రభుత్వ పాఠశాలలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లండి. అంతేగానీ గతంలో నిర్మించిన వ్యవస్థలను నిర్వీర్యం చేసి, దాతలు నిర్మించిన భవనాల వద్ద ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ విద్య బలోపేతం కాదు అని వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top