కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ హయాంలో పరిపాలన పూర్తిగా పట్టాలు తప్పిందని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాకినాడలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన అధికారిక గణాంకాలు, కాగ్ నివేదికలే చంద్రబాబు నాయుడు ఘోర పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రూ. 24 లక్షల కోట్ల అబద్ధపు పెట్టుబడుల ప్రచారం, 4,520 ఎంఎస్ఎంఈల మూతతో లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం, రోజుకు రూ. 492 కోట్ల చొప్పున చేసిన రూ. 3.59 లక్షల కోట్ల అపారమైన అప్పులు, దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిన ద్రవ్య లోటు, రోజురోజుకూ దిగజారుతున్న శాంతిభద్రతలు, వ్యవసాయంపై నిర్లక్ష్యం, డీఎస్సీ నిర్వహణలో భారీ అక్రమాలు..ఇవన్నీ కూటమి ప్రభుత్వ చేతకానితనానికి ప్రత్యక్ష నిదర్శనాలని ధ్వజమెత్తారు. పబ్లిసిటీలో పీక్స్‌లో ఉంటూ, పనితీరులో దయనీయ స్థితికి దిగజారిన కూటమి ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో జరిగిన పెట్టుబడులు, అప్పులు, ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. - అబద్ధాల పెట్టుబడులు – మాయమైన ఉద్యోగాలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇచ్చిన అధికారిక నివేదిక ప్రకారం రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చింది కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే. వాటి మొత్తం విలువ రూ.6,962 కోట్లు కాగా, లభించే ఉద్యోగాలు 22,167 మాత్రమే. అందులోనూ ఇప్పటివరకు పూర్తయినవి రెండే రెండు ప్రాజెక్టులు. అసలు మీరు చెప్తున్న అంకెలకు, వాస్తవాలకు ఏమైనా పొంతన ఉందా?. - పరిశ్రమల మూత - శ్వేతపత్రం విడుదల చేయాలి... కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత రెండేళ్లలో 4,520 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు మూతపడ్డాయి. దీనివల్ల 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్తగా వచ్చే 22,167 ఉద్యోగాల కంటే పోయిన ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో నికరంగా 26,310 ఉద్యోగాలు తగ్గాయి. వైఎస్ జగన్ హయాంలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మరియు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, నేడు 8వ స్థానానికి పడిపోయింది. వీళ్ళ బాధ భరించలేక, వీళ్ళు రెడ్ బుక్ పేరుతో చేస్తున్న వేధింపులు భరించలేక, ఈ రాష్ట్రం నుంచి సుమారు రూ. 6500 కోట్లు పెట్టుబడులు తరలిపోయాయి. ఈ నేపధ్యంలో ఏ జిల్లాకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు పూర్తయ్యాయి? ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేస్తూ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. - అప్పుల్లో అగ్రస్థానం – ఆస్తుల సృష్టి శూన్యం.. వైయస్.జగన్ అప్పులు చేస్తే 'అప్పుల కుప్ప' అని రాసే పచ్చ మీడియా, చంద్రబాబు గారు రోజుకు సగటున రూ. 492 కోట్లు అప్పు తెస్తుంటే దాన్ని 'రుణ సమీకరణ' అని రంగు పూస్తోంది. ఈ అప్పుల డబ్బులన్నీ ఏమయ్యాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? అమరావతి నిర్మాణం కోసం, బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ల పేరుతో రెండేళ్లలో తెచ్చిన మొత్తం అప్పు రూ. 3,59,157. కాగ్ నివేదిక ప్రకారం 2024-25లో రాష్ట్ర ద్రవ్య లోటు (Fiscal Deficit) -5.09 శాతంగా నమోదై దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లకు చేరింది. సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ 22వ స్థానానికి దిగజారింది (కేవలం 1.97% వృద్ధి). బీహార్‌లాంటి రాష్ట్రం 18% వృద్ధి సాధిస్తే, ఏపీ మాత్రం ఘోరంగా వెనకబడింది. జిఎస్‌డీపీలో జిఎస్టీ వాటా 2.20% నుంచి 1.90%కి పడిపోవడం వల్ల రూ. 34,301 కోట్ల రాబడి నష్టం వాటిల్లింది. - వ్యవసాయ రంగం నిర్వీర్యం – రైతుల కష్టాలు.. వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది, ఎరువులు వాడొద్దు, నీళ్లు ఇవ్వలేం అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రైతులకు చెప్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో వరి తప్ప వేరే పంట వేయలేని పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలి? ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం ఇస్తుందా? ఒకవేళ క్రాప్ హాలిడే ప్రభుత్వమే ప్రకటించే ఉద్దేశం ఉంటే, ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తారు? మరి మీరు వరి వేయొద్దు అన్నారు కదా. బదులుగా... ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏమైనా ఇచ్చారా? కనీసం విత్తనాలు కానీ, ఎరువులు కానీ సబ్సిడీ మీద ఇస్తామని చెప్పారా?. ఈ కరువు వల్ల వర్షాలు లేవు, రిజర్వాయర్లు ఎండిపోయినాయి. మీరు వరి వేయొద్దు అంటున్నాం కాబట్టి, ఇదిగో మేము మీకు ఈ సాయం చేస్తాం, లేకపోతే మీ ఫలానా పంట వేయండి, దానికి ఇది ఇస్తాం అని మీరు ఏమైనా చెప్తున్నారా? రైతులు అపరాలు వేస్తే.. వాటిని కొనే ప్రణాళిక మీ దగ్గర ఉందా? దానికి ఏదైనా మీరు మద్దతు ధర ప్రకటిస్తారా? మీ చేత కాని తనంతో సాగును భ్రష్టు పట్టిస్తున్నారు. కేవలం మీరు చెబితే రాసే పత్రికలు, మీరు చెబితే చూపించే ఛానల్లు ఉన్నాయనే మీ ధైర్యం తప్ప ఇంకేముంది? వర్షాల గురించి సమీక్ష కానీ, ఏ డెల్టా పరిస్థితి ఏంటి, ఏ ప్రాంతం ఏంటి అనేది ఎక్కడైనా ఒక అధ్యయనం జరిగినట్టు చూసామా? రిజర్వాయర్లో నీళ్లు లేవు. ప్రణాళిక ఏది? ఎంతసేపు పెట్టుబడులు? ఎంతసేపు అమరావతి మీద రివ్యూలు? ఆ షో చేసి కార్యక్రమాలు, ప్రచారం కోసం కార్యక్రమాలు, ఆ మెగా పిటిఎం అని పెట్టుకోవడం, అక్కడ పిల్లలతో కలిపి భోం చేసిన పిక్చర్స్, వీటి కోసమే తప్ప వెళ్ళండి. కరువు వచ్చింది కదా, ఏం చేద్దాం అని రైతులతో కూర్చున్నారా మీరు ఎప్పుడైనా? రైతుల నుంచి ఫీడ్బ్యాక్ అడిగారా? వైయస్. జగన్ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా రూ. 130 కోట్లు వెచ్చించి పొగాకు కొనుగోలు చేసి మార్కెట్‌ను స్థిరీకరించాం. నేడు కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో పొగాకు రైతులు రోడ్లెక్కుతున్నారు. గతంలో ఉన్నవ్యవసాయ సలహా మండళ్లను మూసేసి, రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. - అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ & లా అండ్ ఆర్డర్ పతనం... దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల పరరిక్షణలో 26వ స్థానానికి దిగజారింది. మహిళల భద్రత కోసం మీరు ఏం చేశారు? కనిపించకుండా పోయిన మహిళల ఆచూకి చెప్పలేని మీరు రాష్ట్రంలో ఇంకేం చేయగలరు? చంద్రబాబు లా అండ్ ఆర్డర్ ప్రత్యేక నమూనా అంటున్నారు.. అంటే 26వ స్థానానికి దిగజార్చడమేనా ప్రత్యేక నమూనా అంటే? తప్పుడు కేసులు, నాన్-బెయిలబుల్ సెక్షన్లతో పోలీసులను రాజకీయ కక్షసాధింపుకు వాడుతున్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కడానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో భయంకరమైన అవినీతి నడుస్తోంది. నేరాల కట్టడి, మహిళల భద్రతపై మీ దగ్గర ప్రణాళిక ఏంటని అడిగితే సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వాన్నే విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కక్షసాధింపు చర్యలు తప్ప, నేరాల కట్టడిపై దృష్టి లేదు. - డిఎస్సీ అక్రమాలపై మంత్రి ఎందుకు రాజీనామా చేయరు? డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మీరే చెప్పారు. దమ్ముంటే కేసును సీబీఐకి ఇచ్చి విచారణ జరిపించండి. లోకేష్ బహిరంగ చర్చకు సవాల్ చేశారు. మేము వెంటనే సిద్ధమని చెప్పాం. దగాపడ్డ అభ్యర్థులతో వస్తామని అడిగాం. కానీ ఇప్పటి వరకు మీ నుంచి సమాధానం లేదు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మరి డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయరు? డీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం రేపటి నుంచి మా పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. అక్రమాలపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాలు ఉద్యమిస్తాయి. ప్రతి తప్పుకూ జగన్ పేరే చెప్పడం మానేసి, మీ పాలనపై ఒకసారి సమీక్ష చేసుకోండి. దమ్ముంటే ఈ కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశించాలి. కేంద్రంలో నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ చర్యలు తీసుకున్నట్లే, ఇక్కడ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. - పంచదారల కొండల అక్రమ తవ్వకాలపై పోరాటం ఆగదు.. అనకాపల్లి జిల్లాలోని చారిత్రాత్మక పంచదారల కొండను అక్రమంగా కేజీఎఫ్ తరహాలో తవ్వేశారు. దాన్ని 'నో మైనింగ్ జోన్'గా ప్రకటిస్తూ అధికారిక జీవో (G.O.) ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. పంచదారల కొండను గ్రావెల్ కోసం అక్రమంగా కేజీఎఫ్‌లా తవ్వేసి ధ్వంసం చేశారు. పంచదారల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకత్వంతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తామని చెబుతున్నారు. కానీ మీ మాటలను మేము నమ్మం. జీవో విడుదల చేసిన తర్వాతే నమ్ముతాం. పంచదారల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ అధికారిక జీవో విడుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అధికారిక జీవో వచ్చే వరకు పంచదారల కొండ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమం ఆపదు. అదే విధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను 86 శాతానికి పైగా వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రధాని మోదీతో ప్రారంభోత్సవం చేయిస్తూ, ఆ క్రెడిట్ తమదే అని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. - సంస్మరణ సభల్లోనూ రాజకీయమే.. దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలకు సొంత పార్టీ నాయకులు వెళ్లకుండా ఆంక్షలు విధించడం చంద్రబాబు నాయుడి సంకుచిత రాజకీయాలకు తార్కాణమన్న కురసాల కన్నబాబు.. రాజకీయాల్లో కనీస మానవ సంబంధాలు, సాంప్రదాయాలను గౌరవించాలని హితవు పలికారు. ముద్రగడ గారు మీకు వర్గ శత్రువా? అని సూటిగా ప్రశ్నించిన కన్నబాబు... రాజకీయాల్లో మానవ సంబంధాలు ఉండవా? వేర్వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన సంతాప సభలో పాల్గొనకూడదా? అని నిలదీశారు. ముద్రగడ గారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి అడ్డొచ్చిన వారిపై కేసులు పెట్టారు. మరి ఇప్పుడు మీ పార్టీ నాయకులు ఆయన సంస్మరణ సభలకు వెళ్తే ఎందుకు తప్పు పడుతున్నారు? అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు.