వైయ‌స్ జగన్‌ పర్యటనపై అడ్డగోలు ఆంక్షలెందుకు? 

చంద్ర‌బాబు సర్కార్‌ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ఆగ్రహం 

 కాన్వాయ్‌ను 8 వాహనాలకే పరిమితం చేయడం.. బారికేడ్లతో నిర్బంధించడం ఏమిటి? 

వైయస్‌ జగన్‌ ప్రజల మధ్యకు వస్తుంటే చంద్రబాబుకు ఎందుకంత భయం? 

అబద్ధాలు పటాపంచలవుతాయనే భయంతోనే అడుగడుగునా అడ్డంకులు 

విశాఖ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల పట్ల వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలనే కాకుండా సామాన్య ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించింది. వైయస్‌ జగన్‌ కాన్వాయ్‌ను కేవలం 8 వాహనాలకే పరిమితం చేయడం, పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించడం రాజకీయ నిర్బంధం కాదా అని నిలదీసింది.

మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుపై రాజకీయ కక్షతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. అక్రమ కేసులతో పార్టీ నాయకులను వేధించడం, వారిని పరామర్శించేందుకు వైయస్‌ జగన్‌ వస్తుంటే అడుగడుగునా ఆంక్షలు విధించడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొంది. వైయస్‌ జగన్‌ ప్రజల మధ్యకు వెళ్తుంటే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించింది.

వైయస్‌ జగన్‌ పర్యటనతో వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని, ఇప్పటివరకు సాగించిన అబద్ధాల ప్రచారం పటాపంచలవుతుందనే భయంతోనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. వాస్తవాలు బయటకు రాకుండా అనుకూల మీడియా, ఫేక్‌న్యూస్‌ వ్యవస్థ ద్వారా గత రెండు వారాలుగా విషప్రచారం సాగిస్తున్నారని పేర్కొంది.

గత రెండేళ్లుగా వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించిన ప్రతి కార్యక్రమం శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిగిందని గుర్తుచేసింది. ఎక్కడా హింసకు, రెచ్చగొట్టే చర్యలకు తావివ్వలేదని స్పష్టం చేసింది. పోలీసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రాజకీయ కక్షతో ఆంక్షలు విధిస్తోందని పేర్కొంది.

గతంలో అంగళ్లు, పీలేరు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులపై దాడులు, వాహనాల దహనం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. వైయ‌స్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో అలాంటి ఘటనలకు ఎన్నడూ తావివ్వలేదని, హింసాత్మక రాజకీయాలకు పార్టీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేసింది.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు ప్రజలను కలవడం, పార్టీ నాయకులకు అండగా నిలవడం వారి హక్కు అని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. ఆ హక్కులను పోలీసు ఆంక్షలతో కాలరాయాలని చూడటం సరికాదని, రాజకీయ కక్షతో ప్రజాస్వామ్య హక్కులను హరించే దిగజారుడు రాజకీయాలను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలని స్పష్టం చేసింది.

Back to Top