గంగమ్మ పేరు ఎత్తితే బదినేహాల్‌లో వణుకు 

నిజం మాట్లాడితే పోలీసులు టార్గెట్‌ చేస్తారన్న భయాందోళనలో గ్రామస్తులు 

ప్రజలను కాపాడాల్సిన వ్యవస్థలే భయపెడుతున్నాయి 

మాజీ మంత్రి డాక్టర్‌ సాకె శైలజానాథ్‌ ధ్వజం 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డితో కలిసి మీడియాతో 
మాట్లాడిన మాజీ మంత్రి డాక్టర్‌ సాకె శైలజానాథ్ 

కొడుకు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించిన గంగమ్మ.. స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టులో 
న్యాయపోరాటం

హైకోర్టు ఆదేశాలతో సిట్‌ ఏర్పాటైన తర్వాత గంగమ్మ అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక అసలేం 
జరిగింది?

గంగమ్మ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యుల కంటే పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొనాల్సిన అవసరం ఏమొచ్చింది?

దర్గయ్య శరీరంపై తీవ్ర గాయాలు ఎలా వచ్చాయి?.. రిమాండ్‌ తర్వాత ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి 
ఎందుకొచ్చింది?

గంగమ్మ మృతిపై పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ పరీక్షల నివేదికలను ప్రభుత్వం బయటపెట్టాలి

సీబీఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో గానీ స్వతంత్ర దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గుతేల్చాలి

గంగమ్మ కుటుంబ సభ్యులకు తక్షణమే భద్రత కల్పించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత 
కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు శైలజానాథ్‌, మనోహర్‌రెడ్డి డిమాండ్ 

తాడేపల్లి: మాల గంగమ్మ అనుమానాస్పద మృతి తర్వాత బదినేహాల్‌ గ్రామాన్ని పోలీసుల భయం వెంటాడుతోందని మాజీ మంత్రి డాక్టర్‌ సాకె శైలజానాథ్‌ ఆక్షేపించారు. గ్రామంలో ఏ అంశంపైనైనా మాట్లాడుతున్న ప్రజలు గంగమ్మ పేరు ప్రస్తావించగానే మౌనం వహిస్తున్నారని, నిజాలు చెబితే తమను పోలీసులు టార్గెట్‌ చేస్తారనే భయాందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలు, హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలే వారిని భయపెట్టే స్థితికి చేరడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనమన్నారు. గంగమ్మ మృతిపై తలెత్తిన అనుమానాలకు సమాధానం చెప్పాలని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

 మీడియా సమావేశంలో వారు ఏమన్నారంటే... 

- ప్రజల రక్షణ కోసం ఉన్న వ్యవస్థలే భయపెడుతున్నాయి: మాజీ మంత్రి డాక్టర్‌ సాకె శైలజానాథ్ 

 ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణ బృందం బదినేహాల్‌ గ్రామానికి వెళ్లినప్పుడు గంగమ్మ మృతి గురించి మాట్లాడేందుకు గ్రామస్తులు భయపడుతున్న పరిస్థితి కనిపించింది. ఆమె కుటుంబ సభ్యుల ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. ప్రజల రక్షణ, క్షేమం కోసం ఏర్పాటైన రాజ్యాంగబద్ధ వ్యవస్థలే ప్రజల్లో భయాన్ని కలిగించే పరిస్థితి రావడం అత్యంత ఆందోళనకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారి రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆలోచించాలి. సాయికృష్ణ మరణం, క్రాంతికుమార్‌ ఆత్మహత్యతో పాటు పోలీసుల వేధింపులు, అనుమానాస్పద మరణాలకు సంబంధించి అనేక ఘటనలు మన ముందున్నాయి. మనిషి ప్రాణానికి, గౌరవానికి విలువ లేకుండా పోతే అది రాజ్యాంగబద్ధ పాలన అనిపించుకోదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు గౌరవంగా జీవించే హక్కును కూడా కల్పిస్తోంది. మరణించిన వ్యక్తికి కూడా గౌరవం దక్కాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. రాష్ట్రంలో లాకప్‌ మరణాలు, అనుమానాస్పద మరణాలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్యలు వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మానవ హక్కులు, రాజ్యాంగబద్ధ రక్షణ గురించి తీవ్రంగా ఆలోచించాలి.

- కొడుకు కోసం న్యాయపోరాటం చేసిన గంగమ్మే ప్రాణాలతో లేకపోవడం అత్యంత కీలకం 

గంగమ్మ కుమారుడు పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ తన కుమారుడి ఆచూకీ కోసం న్యాయపోరాటం చేసిన గంగమ్మే ఇప్పుడు ప్రాణాలతో లేకపోవడం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం. గంగమ్మను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఆమెకు గాయాలు ఎలా అయ్యాయి? ఆమె అంత్యక్రియల్లో అంతమంది పోలీసులు ఎందుకు పాల్గొన్నారు? దర్గయ్య శరీరంపై గాయాలు ఎలా వచ్చాయి? తీవ్ర గాయాలతో ఉన్న అతనికి ముందుగానే వైద్యం ఎందుకు అందించలేదు? పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ పరీక్షల నివేదికల్లో ఏం తేలింది? ఇన్ని ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఎవరినో కాపాడేందుకు వాస్తవాలను దాచిపెడుతున్నారనే అనుమానాలకు తావులేకుండా సత్యాన్ని బయటకు తీసుకురావాలి. అందుకే ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలి. సీబీఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో గానీ విచారణ జరిపించి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలి.

- గంగమ్మ మృతిపై మాట్లాడేందుకే గ్రామస్తులు భయపడుతున్నారు: వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి

 వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 24న డాక్టర్‌ సాకె శైలజానాథ్‌ నేతృత్వంలోని నిజనిర్ధారణ బృందంతో కలిసి బదినేహాల్‌ గ్రామాన్ని సందర్శించాం. గంగమ్మ అనుమానాస్పద మృతికి సంబంధించిన విషయాలు తెలిసినప్పటికీ మాట్లాడితే పోలీసులు తమను టార్గెట్‌ చేస్తారనే భయం గ్రామస్తుల్లో కనిపించింది. గంగమ్మ ఒక సాధారణ ఎస్సీ మహిళ. 2024లో ఆమె కుమారుడు పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదారు నెలలు గడిచినా దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కేసు తీవ్రతను గుర్తించిన హైకోర్టు ఇతర జిల్లాల పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిట్‌ ఏర్పాటైన తర్వాత గంగమ్మ అనుమానాస్పదంగా మృతి చెందడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. గంగమ్మను పోలీసులు తీవ్రంగా హింసించారన్నది మా ఆరోపణ. ఆమె మృతి తర్వాత అంత్యక్రియల్లో కుటుంబ సభ్యుల కంటే పెద్ద సంఖ్యలో పోలీసులు ఎందుకు పాల్గొన్నారు? ఆమె కుమార్తె నుంచి తీసుకున్న ఫిర్యాదులో అనారోగ్య కారణాలను ఎందుకు ప్రధానంగా ప్రస్తావించారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

- సీబీఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో గానీ విచారణ జరపాలి 

గంగమ్మ మృతి చెందిన రోజే ఈ కేసుతో సంబంధం ఉన్న దర్గయ్య విషయంలో జరిగిన పరిణామాలు కూడా అనేక సందేహాలకు తావిస్తున్నాయి. అతని శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ అవి పోలీసు బైక్‌ నుంచి జారిపడి వచ్చినవిగా చెప్పే ప్రయత్నం జరిగిందన్న అనుమానాలున్నాయి. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపిన తర్వాత అతని గాయాల తీవ్రతను గుర్తించిన జైలు అధికారులు ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గంగమ్మ మృతి, దర్గయ్యకు తగిలిన గాయాలు సహా ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలంటే పోలీసు వ్యవస్థకు సంబంధం లేని స్వతంత్ర సంస్థతో విచారణ జరగాలి. సీబీఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో గానీ దర్యాప్తు చేపట్టాలి. గంగమ్మ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలో ఉన్నందున వారికి తక్షణమే భద్రత కల్పించాలి. గంగమ్మ మృతికి బాధ్యులుగా తేలిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి.

Back to Top